సర్వమత సమ్మేళనంగా తెలంగాణ

29 May, 2019 08:09 IST|Sakshi
ముస్లింలకు రంజాన్‌ కిట్స్‌ అందిస్తున్న హరీశ్‌

సాక్షి, సిద్దిపేట : సర్వమతాలకు సమ్మేళనంగా ఉన్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం కాదు.. మనుషులు ముఖ్యం అన్నట్లు గా అన్ని మతాల వారు సోదర భావంతో ఉంటున్నా రని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏటా ముస్లింలకు అందజేసే రంజాన్‌ కానుకను ఆయన మంగళవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామాల్లో అన్ని కులాలు, మతాల వారు కల్మషం లేకుండా జీవిస్తారని, ఇప్పటికీ వారు వరుసలు పెట్టుకొని పిల్చుకుం టుంటే ఒకే కుటుంబంగా అనిపిస్తారన్నారు. హిందువుల బతుకమ్మ పండుగలో ముస్లిం, క్రైస్తవులు, రంజాన్, క్రిస్మస్‌ పండుగల్లో హిందువులు పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ అన్నారు. గ్రామాల్లోని పరిస్థితులను నేరుగా చూసిన నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటంతో అన్ని మతాల వారికి రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

హిందువులకు బతుకమ్మ చీరలు, క్రైస్తవులకు క్రిస్మస్‌ కిట్, ముస్లిం సోదరులకు రంజాన్‌ కిట్స్‌ అందచేసే ఆనవాయితీ కొనసాగిస్తున్నారన్నారు. పండుగ పూట ఒక పెద్దన్నగా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ముస్లిం మైనార్టీల కుటుంబాలకు రంజాన్‌ కానుకల కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు మైనార్టీలకు కూడా ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా సౌకర్యా లు కల్పించామన్నారు. పిల్లలకు మంచి ఆహారం అందించేలా మెనూ ప్రకటించామని, ఎక్కడా రాజీ పడకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు