చంద్రబాబు వద్ద మోకరిల్లుతారా?

29 Oct, 2018 02:12 IST|Sakshi
ప్రసంగిస్తున్న హరీశ్‌రావు

 ‘బాబు’ అపాయింట్‌మెంట్‌కు గంటల తరబడి నిరీక్షణా..

ఉత్తమ్‌ తీరు.. ఆ పార్టీ దయనీయ స్థితిని చాటుతోంది  

మహాకూటమి కుట్రలను ఛేదిస్తాం 

గజ్వేల్, సిద్దిపేట సభల్లో మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌/సిద్దిపేట జోన్‌: టీఆర్‌ఎస్‌ ధాటికి తట్టుకోలేమనే భయంతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రా బాబు చంద్రబాబు వద్ద పొత్తు కోసం మోకరిల్లిందని, తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గంటల తరబడి నిరీక్షించడం ఆ పార్టీ దయనీయ స్థితిని చాటుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌కు మద్దతుగా నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్యుల సమ్మేళనం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి పోతుందని, టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళుతుందని, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)కి ఓటేస్తే ఎటూ గాకుండా పోతుందని ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే అభివృద్ధికి పట్టం కట్టినట్లవుతుందని చెప్పారు. వంద సీట్లతో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపట్డం ఖాయమన్నారు. మహాకూటమి కుట్రలను ఛేదిస్తామన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో కొత్త పుంతలు తొక్కిన అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే కేసీఆర్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.  

జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ తంటాలు..  
టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ నేతలు నానా తంటాలు పడుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీలు ఇవ్వాల్సింది పోయి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌ సరఫరాను అడ్డుకుంటామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ఆపేస్తామని, సీతారామ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను అడ్డుకొని చీకట్లు నింపుతామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఉల్టాపల్టా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలను తెలంగాణలో బొంద పెట్టడానికి ప్రజలంతా ఏకమవుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేతకు రూ.1,200 కోట్లను బడ్జెట్‌లో కేటాయించి, కార్మికుల అప్పులన్నీ మాఫీ చేశామని తెలిపారు. 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు అందించామని పేర్కొన్నారు. అలాగే ఆర్యవైశ్యుల సంక్షేమానికి సైతం టీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్య ఫెడరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సభల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, వైస్‌ చైర్మన్‌ అరుణ తదితరులు పాల్గొన్నారు.  

మహాకూటమిలో రెండు ధ్రువాలు..
మహాకూటమిలో రెండు ధ్రువాలున్నాయని, ఒకరిది కన్ను కొట్టే సిద్ధాంతమని, మరొకరిది రెండు కళ్ల సిద్ధాంతమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించిన ఆయన ఏకలవ్య సమాజం ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఏకలవ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తనపై వివిధ కుల సంఘాలు చూపుతున్న ఆదరణను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. సభలో ఏకలవ్య సమాజం సభ్యులు హరీశ్‌రావుకు ఓ బుట్టను, బాణాన్ని అందించారు. మంత్రి బాణాన్ని ఎక్కుపెట్టి ఏకలవ్యులను సంతోషపర్చారు.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా