బాబూ నీ బండారం బయటపెడతాం!

5 Nov, 2018 02:08 IST|Sakshi

 మా వద్ద నీ వివరాలన్నీ ఉన్నయ్‌

కుట్రలు కొనసాగిస్తే సహించేది లేదు

కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం

ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు నిప్పులు

గజ్వేల్‌/సిద్దిపేట జోన్‌: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బండారాన్ని కొద్దిరోజుల్లోనే బయటపెడతామని, ఆయన వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నవ్‌.. ఇక్కడ నీకేం పని? కేసీఆర్‌ దెబ్బకు అమరావతిలో పడ్డవ్‌.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే సహించం’అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముస్లింలు, కార్మికులు, బీడీ కార్మికుల ఆశీర్వాద సభల్లో ఆయన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌ ప్రసంగిస్తూ చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టికెట్లు ఇచ్చేది, నోట్ల కట్టలు ఇచ్చేది, చివరకు నోటి మాటకు స్క్రిప్టు ఇచ్చేది కూడా అమరావతి నుంచేనని పేర్కొన్నారు. ‘మొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీ వద్దకు టికెట్ల కోసం ఢిల్లీకి పోయిండు. మా టికెట్లు అయిపోయినయ్‌.. మా రాహుల్‌ గాంధీ ప్రకటిస్తడని చెప్పిండు. కానీ ఆడికి పోయినంక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గర ఉన్న లిస్టు తీసుకొని చంద్రబాబు చేతిలో పెట్టి, గివి కరెక్టే ఉన్నయా! చూడుమని చెప్పిండంటా.. గిదేం పరిస్థితి? అంటూ ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి నమూనా అని చెప్పారు. ‘చంద్రబాబూ నీ నాటకాలన్నీ నాకు తెలుసు. మా వద్ద నీ వివరాలన్నీ ఉన్నయ్‌. తెలంగాణ రాకుండా ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్‌ దెబ్బకు అమరావతిలో పడ్డవు. మళ్ళీ కుట్రలు చేస్తే ఏమైతదో రాబోయే రోజుల్లో చెబుతా’అంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు..  
కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే ఆత్మహత్యల్లేని తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు.  ఈ సభల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్, పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, లక్ష్మీకాంతారావు, గాడిపల్లి భాస్కర్, డాక్టర్‌ యాదవరెడ్డి, మజీద్‌ కమిటీ అధ్యక్షుడు యూసుఫొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
ఏపీలో బాబు చిత్తే..
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వస్తే అక్కడ చంద్రబాబు చిత్తు చిత్తవుతాడని, అక్కడి పరిస్థితి బాబుకు రివర్స్‌ గేరులో ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో కురుమ, జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళనం, పీఆర్‌టీయూ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జెండా, ఎజెండా లేని కూటమికి కేవలం అధికార కాంక్షనే ఉందన్నారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు తమదే అన్నారు. ఇటలీ దయ్యమంటూ సోనియాను దూషించిన చంద్రబాబుకు ఇçప్పుడు సోనియా దేవత ఎలా అయిందని ప్రశ్నించారు. టీడీపీకి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టవ న్నారు. కాగా, ఉద్యోగుల పట్ల తమ సర్కారు ఎప్పటికీ సానుకూలంగా ఉంటుందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు