మాది జల విజయ యాత్ర

6 Apr, 2018 01:54 IST|Sakshi
వనపర్తి జిల్లా పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ నీటికి హారతి ఇస్తున్న మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌ది అధికార దాహ యాత్ర: హరీశ్‌రావు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాల్వలు, రిజర్వాయర్‌ పనుల పరిశీలన

పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ నీటి విడుదల 

సాక్షి వనపర్తి: కాంగ్రెస్‌ నాయకులు అధికార దాహంతోనే బస్సు యాత్ర చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వారిది అధికార దాహ యాత్ర అయి తే తమది జల విజయయాత్రని అన్నారు. గురువారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో కేఎల్‌ఐ ప్రాజెక్టు కాల్వలను పరిశీలించారు. అక్కడి నుంచి కల్వకుర్తికి చేరుకుని జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు టెయి ల్‌ ఎండ్‌ కాల్వ పనులను పరిశీలించారు. అనంతరం తిమ్మాజీపేట మండలం ఆవంచ సమీపంలో చేపట్టిన అక్వాటెక్‌ పనులపై ఆరా తీశారు. 

ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వట్టెం రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. అనంతరం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం లోని బుద్దారం ఎడమ కాలువ వద్ద నుంచి ప్రారంభమవుతున్న పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ నీటికి పూజలు చేశారు. అటు నుంచి వీరుల చెరువు వద్దకు వచ్చి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత పెద్దమందడి మండలంలోని జంగమాయపల్లి, బలిజపల్లి శివార్లలోని వీరుల చెరువు వద్ద రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు.  

కాంగ్రెస్‌కు సమస్యలు దొరకడం లేదు.. 
కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సమస్యలు దొరకడం లేదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను వెతకడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి చేయడమే కాకుండా చెప్పని ఎన్నో పనులను చేసి చూపిస్తున్నామని మంత్రి అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పట్టించుకోవడమే మానేశారని, ఫలితంగా వారు ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది నీటిని పారిస్తామని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. 

గత ప్రభుత్వాల హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఆ నియోజకవర్గానికి నిధులు దక్కేవని, అయితే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలోని ప్రజలు మనవాళ్లే కాబట్టి అభివృద్ధి సమాంతరంగా జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిపాజిట్లు కోల్పోయి తీర్థయాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో కూడా నీరు దొరకని నేలలకు వేసవిలో కూడా చెరువులు పొంగేలా నీరు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావులకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు