యుద్ధ ప్రాతిపదికన ‘కాళేశ్వరం’

31 Mar, 2017 03:18 IST|Sakshi
యుద్ధ ప్రాతిపదికన ‘కాళేశ్వరం’

పనుల వేగం పెంచాలని అధికారులకు హరీశ్‌ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రాజెక్టు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. గురువారం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భూసేకరణ, పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఏడాదిలోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తవ్వాలని, 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయగల ఈ పంప్‌హౌస్‌లు పూర్తయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హరీశ్‌ చెప్పారు. గోదావరి జలాలను ఏడాది చివరి కల్లా ప్రాజెక్టు నుంచి తెలంగాణ పొలాలకు తరలించే లక్ష్యంతో పనిచేయాలన్నారు.

ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు ఏజెన్సీలకూ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనదని, కాబట్టి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన చోట నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టు ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్‌ జరిగే సమయంలోనే రైతుకు పరిహారం చెల్లింపులు జరగాలని, చెల్లింపుల్లో జాప్యం తగదన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే అసైన్డు భూములకూ పరిహారం ఇవ్వాలన్నారు. మూడు బ్యారేజీలతో పాటు పంప్‌హౌజ్‌ల పనులనూ ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రాజెక్టు పనులను మానిటర్‌ చేస్తున్నామని.. ఇకపై పనుల పురోగతిని ప్రతి నెలా సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు