వారి కడుపుకోత తీర్చలేనిది

20 Sep, 2014 00:27 IST|Sakshi
వారి కడుపుకోత తీర్చలేనిది

తూప్రాన్: రైలు బాధిత చిన్నారుల కుటుంబాల కడుపుకోత తీర్చలేనిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మాసాయిపేట రైలు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకున్న చిన్నారుల కుటుంబాలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం మంత్రి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన 16 మంది చిన్నారులతో పాటు డ్రైవర్, క్లీనర్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించామన్నారు. గాయపడిన చిన్నారులు కోలుకున్న అనంతరం లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆనాడు చెప్పామన్నారు.
 
కాని మెదక్ ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉన్నందున ఇవ్వడం కుదరలేదని, ప్రస్తుతం కోడ్ ముగియడంతో గాయపడిన 18 మంది చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు వివరించారు. రైలు దుర్ఘటనలో గాయపడిన, దుర్మరణం చెందిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే చేపడితే ప్రతి పక్షాలు రాద్దాంతం చేశాయన్నారు. ప్రజలకు సేవకులుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెదక్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వదంలో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.  
 
ఏపీకంటే ముందుగా రైతులకు రుణాలిస్తాం
ఏపీ రాష్ట్రంలో కంటే ముందే తెలంగాణలోని రైతులకు ఖరీఫ్ రుణాలు అందించి రైతులను ఆదుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రైతు రుణాల మాఫీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఆర్‌బీఐ ఎన్ని ఆంక్షలు పెట్టినా రుణమాఫీ చేసితీరుతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకర్లకు రైతుల రుణాలను మాఫీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మేలు జరగకపోగా, నట్టేట ముంచిన పాపం కాంగ్రెస్‌దేనని విమర్శించారు.  
 
ప్రభుత్వం స్పందించిన తీరు అమోఘం..
ప్రభుత్వం తమను ఆదుకోకపోతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని బాధిత కుటుంబాల తల్లిదండ్రులు పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావు తక్షణమే స్పందించి యాశోద ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించారని కొనియాడారు. వైద్యులు సైతం తమ పిల్లలను కంటికి రెప్పల కాపాడారని అన్నారు.   కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, ఎంపీపీ గుమ్మడిశ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు రఘునాథరావు, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ శివమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు