డబుల్‌ బెడ్రూం ఇళ్లతో కల సాకారం

30 Sep, 2019 08:35 IST|Sakshi
బల్కంచెల్క తండాలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నేడు బల్కంచెల్క తండాలో సామూహిక గృహ ప్రవేశాలు  

ప్రారంభించనున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు   

జిల్లాలో పూర్తయిన తొలి డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవే.. 

ఎప్పుడెప్పుడా అని ఆ తండావాసులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. బల్కంచెల్క తండా గిరిజనులు ఇప్పుడు డబుల్‌ బెడ్రూం ఇళ్ల కానుకను అందుకోవడానికి రెడీ అయ్యారు. జిల్లా మొత్తంలోనే డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు ముహూర్తం నిర్ణయించింది ఈ తండాలోనే. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ తండావాసులతో సోమవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయించనున్నారు.  

సాక్షి, కల్హేర్‌(నారాయణఖేడ్‌): గిరిజనుల ఐక్యతతో తండా ఆదర్శనీయంగా పేరుగాంచింది. దసరా పండుగ కోసం ప్రభుత్వం ముందస్తు కానుక ఇచ్చింది. జిల్లాలో తొలిసారిగా కల్హేర్‌ మండలం బాచేపల్లి బల్కంచెల్క తండాలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పేదల కల సాకారమైంది. నేడు సామూహిక గృహప్రవేశాలు జరిపేందుకు ముహుర్తం ఖరారైంది. రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ హనుమంతరావు జిల్లా అధికారులతో కలిసి బల్కంచెల్క తండాను సందర్శించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అధికారులను రంగంలోకి దింపారు.

బల్కంచెల్క  తండాలో ప్రభుత్వం 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పట్టణం పుట్టిన గడ్డను అభివృద్ధి చేసేందుకు తండాలోని శ్రీ విశ్వమాళిని జగదాంబ మందిరం ధర్మకర్త, మెడ్చల్‌ జిల్లా రవాణా శాఖ అధికారి మూడ్‌ కిషన్‌ సింగ్‌ నిరంతరం శ్రమిస్తున్నారు. తండాలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రభుత్వం రూ. 2.52 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే కృషితో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బీజం పడింది. పనులు పూర్తి కావాడంతో లబ్ధిదారుల ఎంపిక చేశారు. కలెక్టర్‌ హనుమంతరావు సమక్షంలో అధికారులు లాటరీ పద్ధతిలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. 

 ఇళ్లను పరిశీలించిన ఆర్డీఓ 
కల్హేర్‌(నారాయణఖేడ్‌): మండలంలోని బాచేపల్లి బల్కంచెల్క తండాలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను నారాయణఖేడ్‌ ఆర్డీఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ పరిశీలించారు. బల్కంచెల్క తండాలో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేశారు. గృహప్రవేశాల ఏర్పాట్లపై బల్కంచెల్క తండాలోని మందిరం ధర్మకర్త, మెడ్చల్‌ జిల్లా రవాణా శాఖ అధికారి మూడ్‌ కిషన్‌ సింగ్, అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌  రాంసింగ్, జెడ్పీటీసీ నారాయణరెడ్డి, తహసీల్దార్‌ శేఖర్, పీఆర్‌ డీఈఈ ఆంజయ్య, మిషన్‌  భగీరథ డీఈఈ ఫణివర్మ, ఏఈలు శ్రీకాంత్, మాధవనాయుడు, ఈజీఎస్‌ ఏపీఓ నర్సింలు, గిర్దవర్‌ ఎండి.ఖాలీద్, మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ పద్మ బాపురాజు, సర్పంచ్‌ మూడ్‌ లలిత, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిగోండ, రూప్‌సింగ్‌ పాల్గొన్నారు. 

పేదలకు ఇళ్లు 
బల్కంచెల్క తండాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇళ్లు లేని వారికి డబుల్‌ బెడ్రూం కేటాయించారు. తండా ఇతర తండాలకు ఆదర్శంగా నిలుస్తుంది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కోసం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని విన్నవిస్తాం. –మూడ్‌ లలిత కిషన్‌ సింగ్, సర్పంచ్‌ బల్కంచెల్క తండా  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా