రైతు పేరిట వ్యాపారుల దాడులు

4 Dec, 2017 02:49 IST|Sakshi

అటువంటి వారి లైసెన్సు రద్దు చేయాలి

అధికారులకు మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మార్కెటింగ్‌ శాఖలో రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు హమాలీలతో దాడులు చేస్తారని, అటువంటి వ్యాపారులను గుర్తించి వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం మార్కెట్‌శాఖ ఈ–సేవలపై శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇప్పటివరకు మార్కెట్లలో లైసెన్స్‌లు ఎన్ని ఉన్నాయో చూసి కొత్త లైసెన్స్‌లు ఇవ్వాలన్నారు.

లైసెన్స్‌లు 120 ఉంటే వ్యాపారం చేసేవారు 20 మంది మాత్రమే కాబట్టి కొత్త వారికి లైసెన్సులు ఇవ్వాలన్నారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ–నామ్‌ వినియోగంలో ఇప్పటికే దేశంలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నామన్నారు. తాజాగా దేశంలోనే తొలిసారిగా మార్కెటింగ్‌ శాఖలో ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించి టెక్నాలజీ వినియోగంలో మనకు మనమే సాటి అన్న రీతిలో సాగిపోతున్నామన్నారు. ప్రస్తుతానికి 44 మార్కెట్‌ యార్డుల్లో కొనసాగుతున్న ఈ–నామ్‌ను 2018 ఖరీఫ్‌ నాటికి మిగిలిన 14 మార్కెట్లలోనూ ప్రారంభిస్తామన్నారు.

వచ్చే ఖరీఫ్‌ నాటికి నూటికి నూరు శాతం అన్ని మార్కెట్లలో ఈ–నామ్‌లు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతీది ఆన్‌లైన్లోనే జరగాలన్నారు. సర్వర్‌ పనిచేయడం లేదంటూ తనకు చెప్పొద్దని, ఏ సిగ్నల్‌ అందుబాటులో ఉంటే ఆ నెట్‌వర్క్‌కు వెళ్లాలని సూచించారు. రైతులకు మద్దతు ధర వచ్చేవిధంగా, రైతులు మార్కెట్లో ఉండకుండా ఆన్‌లైన్‌ లో డబ్బులు పడే విధంగా చేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల టన్నుల సామర్థ్యమున్న మార్కెట్‌ గోదాములు ఉన్నాయన్నారు.


నల్లగొండలో మార్కెట్లు ప్రారంభం
రైతులకు మేలు చేసేందుకు నల్లగొండలో బత్తాయి, నిమ్మ మార్కెట్లు నిర్మించామన్నారు. వారంలో నల్లగొండలో మార్కెట్లు ప్రారంభిస్తామన్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నామని అన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవడంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి దాన్ని గ్రూపులో చూస్తున్నానని వివరించారు. మార్కెటింగ్‌శాఖలో ఇంకా జవాబుదారీతనం పెరగాలన్నారు. లైసెన్స్‌ ఇచ్చేందుకు, వాహనాల చెకింగ్‌ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ తీసుకు వచ్చామన్నారు. దీనివల్ల అవకతవకలు జరగవన్నారు. దీని ద్వారా అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రంలో కొనేందుకు చట్టం తీసుకు వస్తున్నామన్నారు. ఈ విషయంపై సీఎంతో మాట్లాడామన్నారు. ఈ–నామ్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా దళారీ వ్యవస్థ పోతుందన్నారు.  

మరిన్ని వార్తలు