సీఎం కేసీఆర్‌ రైతుగా ఆలోచిస్తున్నారు

2 Aug, 2017 01:41 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ రైతుగా ఆలోచిస్తున్నారు

► ఆయన నిర్ణయాలతో సాగునీటి రంగం బలోపేతం: హరీశ్‌
► ఏపీ పాలకులు తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదు
► ఎస్సారెస్పీని నిర్వీర్యం చేశారు.. దానికి మళ్లీ ప్రాణం పోస్తాం
► అందుకే ఎస్సారెస్పీ పునర్జీవన పథకం
► పథకానికి 10న సీఎం శంకుస్థాపన.. అక్కడే బహిరంగ సభ


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఎంతో అన్యాయం జరిగింది. ఏపీ పాలకులు తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సోయి లేక ఎంతో నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్‌ ఒక రైతుగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో సాగునీటి రంగం బలోపేతమవుతోంది. ఇందులో భాగంగానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునర్జీవన పథకానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణకు మరో రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తాం. మొత్తంగా రూ.2 వేల కోట్లతో పనులు మొదలు కానున్నాయి’’అని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని తీసుకుంటూ ఎస్సారెస్పీ వరద కాల్వలను జలాశయంగా వాడుకుంటామని, మూడు చిన్న ఎత్తిపోతల ద్వారా ఆ నీటిని ఎస్సారెస్పీ జలశయానికి చేరుస్తామని చెప్పారు. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 80 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేయలేకపోతున్నామన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి ఈ నెల 10న సీఎం శంకుస్థాపన చేస్తారని, అదేరోజు మధ్యాహ్నం ప్రాజెక్టు వద్ద రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు.

గోదావరిపై తెలంగాణలోని ముఖ్యమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా చుక్కనీరు రాలేదని, అదే మేడిగడ్డ వద్ద నిత్యం లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు వెళ్లిపోతోందని హరీశ్‌ పేర్కొన్నారు.1964లో మొదలైన ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు ఒక్కసారి కూడా నీరివ్వలేదని చెప్పారు. గతేడాది ఎస్సారెస్పీ ప్రాజెక్టు తాగునీరు కూడా అందివ్వలేక పోయిందని, ఇదంతా గత పాలకులైన కాంగ్రెస్, టీడీపీల పుణ్యమని హరీశ్‌ ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే ఎస్సారెస్పీ పునర్జీవన పథకం చేపట్టినట్టు వివరించారు.

ఉమ్మడి పాలనలో అక్కడ అలా.. ఇక్కడ ఇలా!
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలోని ధవళేశ్వరం, ప్రకాశం, సుంకేసుల ఆనకట్టలన్నింటినీ బ్యారేజీలుగా మార్చుకున్నారని, కేసీ కెనాల్‌ను ఆధునీకరించారని కానీ తెలంగాణలోని సదర్‌మట్‌ను విస్మరించారని హరీశ్‌ అన్నారు. తెలంగాణ వచ్చాకే సదర్‌మట్‌ను బ్యారేజీగా మార్చేందుకు రూ.315 కోట్లు విడుదల చేశామని, దీనివల్ల 1.6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. మెదక్‌ జిల్లా ఘనపూర్‌ ఆనకట్టను విస్మరించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి భూసేకరణ కూడా పెద్దగా అవసరం లేదని కేవలం 40 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని, 156 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని, మూడు దశల్లో 33 మీటర్లు ఎత్తి పోస్తే ఎస్సారెస్పీ జలాశయానికి నీటిని చేర్చొచ్చని వివరించారు.

మరిన్ని వార్తలు