ప్రజాస్వామ్యం అంటే ఏంటి?

11 Jan, 2020 01:39 IST|Sakshi
మంత్రికి తన బాధను వినిపిస్తున్న గంగోత్రి 

విద్యార్థులకు ‘టీచర్‌’ హరీశ్‌రావు ప్రశ్నల వర్షం 

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరోసారి టీచర్‌ అవతారమెత్తారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల పరిధిలోని హద్నూర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అదనపు తరగతి గదులు, డప్నూర్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులను పిలిచి 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్ర అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం కళాశాల భవనాన్ని నిర్మించిందని, కాని విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, నాణ్యమైన విద్యనందించాలని అధ్యాపకులను కోరారు.

ఎంత ఖర్చయినా చదివిస్తా: ఓ విద్యార్థిని చదువుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గంగోత్రి అనే విద్యార్థిని మంత్రి వద్దకు వెళ్లి ‘మాది బీద కుటుంబం, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. నేను చదువుకుంటానో లేదో’ అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన ఆయన ‘నీవు ఎక్కడ చదువుకుంటావు.. చెప్పు! పూర్తి ఖర్చును నేనే భరిస్తాను’అని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు