నా విజయం కార్యకర్తల ఘనతే

22 Dec, 2018 01:27 IST|Sakshi

ప్రచారం చేయలేదు.. డబ్బు, మద్యం పంచలేదు

అయినా చరిత్రను తిరగరాసే మెజారిటీ ఇచ్చారు

నా తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేసుకుంటా

కృతజ్ఞత సభలో హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యంతో ప్రలోభాలు ఉంటాయి.. అయితే ఇవేమీ సిద్దిపేట నియోజకవర్గంలో పనిచేయలేదు. మీ వద్దకు నేను ఓట్లు అడగడం కోసం కూడా రాలేదు. అయినా నాకు ఘనవిజయం తెచ్చిపెట్టారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. పార్టీ అప్పగిం చిన పనిని విజయవంతంగా నిర్వర్తించాను’ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పత్తిమార్కెట్‌ యార్డులో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేం దుకు ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడా రు. కొడంగల్, కొల్లాపూర్, అలంపూర్‌ తదితర నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిం చేందుకు ప్రచారం చేశానని చెప్పారు.

తనతోపాటు సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా వివిధ నియోజకవర్గాల్లో పనిచేశారని, అక్కడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో పాలుపంచుకున్నారని తెలిపారు. తాను ఇతర నియోజకవర్గాల పర్యటనలో ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని.. చరి త్రను తిరగరాసేలా గెలుపు సాధించి పెట్టారన్నారు. ఈ విజయం తన ఒక్కడిది కాదని, ఇది ప్రజల విజయమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని, అందుకోసమే దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ప్రజల కోసం వినియోగిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవచేస్తానని చెప్పారు. ఎవరికి కష్టం వచ్చినా అది తన కుటుంబ సభ్యులకు వచ్చినట్లే అనుకుంటానని అన్నారు. నాయకులంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారని, కానీ తాను ఎప్పుడూ మీ వెంటే ఉన్నానని, మీకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెక్కడా లేదని పేర్కొన్నారు. ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. 

నిజమైన పని ఇప్పుడే మొదలైంది..
నిజమైన పని ఇప్పుడే మొదలైందని, తన బాధ్యత మరింత పెరిగిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచామని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయని అన్నారు. దీంతో యువతకు ఉపాధి మార్గాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని దేశ, విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించడం, ఇక్కడి పనులను వారి ప్రాంతాల్లో అమలు చేసేందుకు వివరాలు తీసుకువెళ్లడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఈ ప్రాంతం ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా గౌరవం ఏముంటుందన్నారు. రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, దీంతో ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల పురస్కారంతోపాటు, గౌరవం కూడా పెరుగుతుందని అన్నారు. భేషజాలకు పోయి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌ సంపత్, ఎంపీపీ మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు