కాళేశ్వరంతో ఐదు జిల్లాలకు తొలి ఫలితం

13 Jul, 2018 01:52 IST|Sakshi

ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల కింద 9.60 లక్షల ఎకరాలకు సాగునీరు: హరీశ్‌రావు  

దసరా రోజున సూరమ్మ చెరువుకు నీరు విడుదల  

ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తొలి ఫలితం ఐదు జిల్లాలకు అందనుందని, అందులో పాత కరీంనగర్‌ జిల్లా ఉందని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లో ఎంపీ వినోద్‌ కుమార్, ఈఎన్సీ అనిల్‌ కుమార్, ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండేలతో కలసి ఇంజనీర్లతో పలు ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.

ఈ ఏడాదిలో ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ కింద 9.60 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపా రు. కాకతీయ కాలువ ద్వారా 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కాలువల మరమ్మతు కోసం వెయ్యి కోట్లు విడుదల చేశామన్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టు కింద భూసేకరణ కోసం రూ.20 కోట్లు, ఆర్‌ అండ్‌ఆర్‌ కింద రూ.25 కోట్లు, ఎల్లంపల్లి భూసేకరణ కింద రూ.15 కోట్లు ఈ రోజే విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దసరా రోజున సూరమ్మ చెరువుకు నీరు విడుదల చేస్తామన్నారు.

ఆ దిశగా పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, మంథని,ధర్మపురి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీటిని ప్యాకేజీ–8 ద్వారా ఇవ్వబోతున్నామని హరీశ్‌ స్పష్టం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్‌ అహ్మద్, దేవసేనలతో ఫోన్‌లో మాట్లాడి నీటి ప్రణాళికపై జిల్లా స్థాయి లో సమీక్ష.. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మిడ్‌ మానేరు ద్వారా మానకొండూర్, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు ఈ ఏడాది నీరు అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు సతీష్‌కుమార్, శ్రీకాంత్‌రావు, వెంకటేశ్వర్, శ్రావణ్‌కుమార్, ఈఈ లు, డీఇఇలు, ఏఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

కాళేశ్వరం పనుల పర్యవేక్షణ
ప్రాజెక్టులపై సమీక్ష అనంతరం మంత్రి హరీశ్‌రావు నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు వెళ్లారు. ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, చీఫ్‌ ఇంజనీరు ఎన్‌.వెంకటేశ్వర్లు ఇతర ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి ఆయన సుందిళ్ల బ్యారేజీ పనులను పరిశీలించారు. అనంతరం ఇంజనీర్లతో పని ప్రగతిపై సమీక్షించిన మంత్రి సుందిళ్ల బ్యారేజీ వద్దే రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు