మీ ఆరోగ్యమే నా సంతోషం

29 Aug, 2019 10:08 IST|Sakshi
ఇబ్రహీంపూర్‌లో గృహ ప్రవేశం అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతున్న హరీశ్‌రావు

యోగాతో ఇబ్రహీంపూర్‌ ఆరోగ్య గ్రామంగా మారాలి

ట్యూషన్‌ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రథమం

అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తాం

సాక్షి, సిద్దిపేట: ప్రతి రోజూ ఉదయం అరగంట యోగా, ప్రణాయామం చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని, గ్రామ ప్రజల ఆరోగ్యంలోనే సంతోషం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం నారాయణరావుపేట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు, సీసీ కెమెరాలు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన సామూహిక డబుల్‌బెడ్రూంలను ప్రారంభించారు.

రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను, సీసీకెమెరాలను ప్రారంభించారు. రూ.35లక్షలతో నిర్మించనున్న డైనింగ్‌హాల్, కిచెన్‌హాల్, రూ.15లక్షలతో నిర్మించే ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేవానికి హాజరై మాట్లాడారు. ఇబ్రహీంపూర్‌ గ్రామంలో డాక్టర్‌ రఘురాం సహకారంతో పాఠశాల అనంతరం పిల్లలకు 4.30 గంటల నుంచి 6.30గంటల వరకు టిఫిన్‌ పెట్టి, ట్యూషన్‌ చెబుతున్నారని, ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిదని పేర్కొన్నారు. ట్యూషన్‌లో బోధించేందుకు గ్రామంలో బీఈడీ పూర్తి చేసుకున్న వారిని ఎంపిక చేసి నెలకు రూ.5వేలు వేతనంగా అందిస్తున్నట్లు తెలిపారు.

మహిళలందరికీ కాన్సర్‌ పరీక్షలు
ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న క్యాన్సర్‌ నిపుణుడు డాక్టర్‌ రఘురాం సహకారంతో నియోజకవర్గంలోని 35 – 45  సంవత్సరాల మహిళలందరికీ సిద్దిపేటలలోని ఏఎన్‌ఎం, ఆశావర్కర్లతో స్క్రీనింగ్‌ చేస్తారని, మొదటి దశలోనే గుర్తిస్తే రొమ్ము కాన్సర్‌ బారిన పడే మహిళల ఆరోగ్యాన్ని కాపాండేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా సిద్దిపేట నుంచే ప్రారంభిస్తామన్నారు.

అంతకుముందు పద్మశ్రీ డాక్టర్‌ రఘురాం మాట్లాడుతూ గ్రామానికి సేవ చేసేలా అవకాశం ఇవ్వడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పాఠశాలలో ట్యూషన్‌ ఖర్చులు, పశువుల షెడ్ల నిర్మాణంలో తన వంతుగా సహకరిస్తానని తెలిపారు. అనంతరం గ్రామంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు 10 మందికి పట్టాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమల్లు, జెడ్పీటీసీ కుంబాల లక్ష్మి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మాతాశిశుసంక్షేమ శాఖ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బూర విజయ, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సర్పంచ్‌ దేవయ్య పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేదింది
చాలా రోజులుగా ఇల్లు కట్టుకోవాలనే నా కల నెరవేరింది. డబుల్‌ బెడ్రూం ఇల్లు  సొంతం కావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు రావడం అనేది దేవుడిచ్చిన వరం. కేసీఆర్‌ సారుకు, హరీశ్‌రావు సారుకు రుణపడి ఉంటాం.
– పెండ్యాల నర్సవ్వ, ఇంటి లబ్ధిదారు

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది. మా కుటుంబం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఏళ్లుగా గుడిసెల్లో బతికాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.
– పెండ్యాల వసంత, ఇంటి లబ్ధిదారు

మరిన్ని వార్తలు