అన్నదాతకు అందలం  

11 Aug, 2018 11:01 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

రైతుల చుట్టే  ప్రభుత్వ పథకాలు

గోదావరి నీటితో కరువును తరిమేస్తాం

అభివృద్ధి చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ విమర్శలు

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట : రైతుల కష్టాలు స్వయంగా చూసిన ముఖ్యమంత్రిగా ప్రతి అడుగూ రైతు కోసం.. ప్రతీ పథకం రైతు సంక్షేమం కోసం.. ప్రవేశపెడుతూ అన్నదాతను అందలానికి ఎత్తుతున్న ఏకైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులు బీమా పత్రాలను అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో పహానీ నఖలు, పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రైతులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే వారని అన్నారు. కానీ ఇప్పుడు భూ ప్రక్షాళన చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతుల ఇంటికి తెచ్చి ఇస్తున్నారని ఆయన అన్నారు. అడగకుండానే రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా.. అంటూ రైతుల అవసరాలు తీరుస్తున్నారని వివరించారు.

దీంతో రైతుల్లో తమకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం పెరిగిందని అన్నారు. ఒక్క సాగునీటి సమస్య తీరితే తెలంగాణ ప్రాంతం కోనసీమను తలదన్నే విధంగా మారుతుందని అన్నారు. అందుకోసమే గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు పారించాలనే తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు.  

కాళేశ్వరం పూర్తి చేసి తీరుతాం.. 

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోచంపల్లి, ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు కట్టిందని.., అదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పనులతో పూర్వ వైభవం సంతరించుకున్న చెరువుల్లో గోదావరి జలాలు నింపే రోజులు దగ్గరకు వచ్చాయని.. వచ్చే వానాకాలం వరకు చెరువులు నింపి మత్తడి దునికేలా చేస్తామని అన్నారు.

రైతులకు మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోవడంలేదని, వారి వక్రబుద్ధిని ప్రదర్శించి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్‌ నాయకులైన జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీకి కూడా రైతు బంధు చెక్కులు అందజేశామని చెప్పారు.

కార్యక్రమంలో సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాగుల సారయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నాగిరెడ్డి, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సిద్దిపేట, నంగునూరు ఏఎంసీ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, సురేందర్, పీఏసీఎస్‌ చైర్మన్లు రమేష్‌గౌడ్, సోమిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘సేఫ్‌ సిద్దిపేట’ను రూపొందిద్దాం

 సిద్దపేటజోన్‌: శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్‌శాఖకు తోడ్పాటుగా ఆయా వార్డుల్లో స్వచ్ఛందంగా  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సేఫ్‌ సిద్దిపేటగా మారుద్దామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డును వందశాతం సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన తొలి వార్డుగా ప్రకటించి నిఘా వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా ఐదుగురు పోలీస్‌లతో సమానమని అన్నారు.

ఇప్పటికే సిద్దిపేటలో 200పైగా కెమెరాలు ఏర్పాటు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పర్యవేక్షణ వ్యవస్థను  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 14వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంపత్‌రెడ్డితో పాటు వైద్యులను మంత్రి అభినందించారు. జనవరి 1నాటికి జిల్లాలో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వందశాతం సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి రాష్ట్రంలోనే మెట్టమొదటి జిల్లాగా చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు.

ఆ దిశగా పోలీస్‌శాఖ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనవరి 1నాటికి ప్రతి గ్రామంలో మొత్తంగా 10వేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలను, వ్యాపారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఏసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్‌రెడ్డి, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, తాళ్లపల్లి సత్యనారాయణ, నాయకులు శర్మ, చంద్రం, భీమసేన,Ðð వైద్యులు భాస్కర్‌రావు, గాయత్రి రవీంద్రనాథ్, వీవీరావు, పెద్దిరాజు, లక్ష్మీశ్రీనివాస్, చంద్రశేఖర్, గణేష్, మురళీక్రిష్ణ, చందర్‌తో పాటు వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా