చనిపోయిన వారికీ పెన్షన్లు..

6 Dec, 2019 03:28 IST|Sakshi

డేటా అందుబాటులో లేక ఆసరా నిధుల దుర్వినియోగం

సీఎఫ్‌వోల సదస్సులో ఆర్థికమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సరైన సాంకేతిక వ్యవస్థ, డేటా అందుబాటులో లేకపోవటమే దీనికి కారణమని చెప్పారు. గురువారమిక్కడ సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో 2వ ఎడిషన్‌ ‘సీఎఫ్‌ఓ కాన్‌క్లేవ్‌’జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌ మాట్లాడుతూ.. ‘పోస్టల్‌లో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తారు కనుక ఒకవేళ లబ్ధిదారులు మరణిస్తే వాళ్ల పెన్షన్‌ను డేటా నుంచి తొలగిస్తున్నారు.

అదే బ్యాంకింగ్‌ విధానంలో ఇది జరగటం లేదు. లబ్ధిదారుడు మరణించినా బ్యాంక్‌ ఖాతాలో పెన్షన్‌ సొమ్ము జమవుతూనే ఉంటోంది. దీన్ని తన కుటుంబీకులో, ఇతరులో తీసుకుంటున్నారు. కొన్ని అలాగే ఖాతాలో ఉండిపోతున్నాయి’అని వివరించారు. పెన్షన్‌ లబ్ధిదారులు మరణించిన వివరాలు ప్రభుత్వ డేటాకు చేరడం లేదని అందుకే పెన్షన్‌లో డ్రాపవుట్స్‌ 1.5 శాతమే ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పింఛను లబ్ధిదారుల వివరాలను, కొత్త దరఖాస్తులను అన్నింటినీ బ్యాంకర్లు, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, టీఎస్‌ఐటీఈఎస్‌తో పరిశీలన జరిపిస్తున్నట్లు తెలిపారు.

గుండె ఆగినంత పనైంది..  
ఇటీవల టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం జరిగింది. ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ప్రకటించడంతో గుండె ఆగినంత పనైందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. కంపెనీలకు అందాల్సిన రాయితీలపై ఆ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎప్పుడు కలిసినా గొడవ జరుగుతోందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు