కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు

3 Oct, 2019 09:21 IST|Sakshi
నాచారం గుట్ట వద్ద శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

సీఎం హామీ మేరకు హల్దీవాగుపై చెక్‌డ్యాం

నాచారం గుట్ట అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

350 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, వర్గల్‌(గజ్వేల్‌): కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహక్షేత్రం వద్ద హల్దీ వాగు జీవనదిగా మారనుందని రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులు తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం వర్గల్‌ మండలం నాచారం గుట్ట పుణ్యక్షేత్రం వద్ద రూ 7.48 కోట్ల వ్యయంతో హల్దీవాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులకు ఆయన, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో భాగంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం హల్దీవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. చెక్‌డ్యాం నిర్మాణంతో 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందన్నారు. దేవస్థానం ముందు హల్దీవాగు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు, గోదావరి జలాల ప్రవాహంగా మారనుందన్నారు.

కాలమైనా, కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఎగువన ఉన్న మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా హల్దీవాగు మీదుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టును నింపనున్నామని స్పష్టం చేశారు. హల్దీవాగు ఇక జీవనదిగా మారనుందని, రైతులు మొగులుకు మొఖం పెట్టి చూసే రోజులు పోతాయని, ప్రతిరైతు కళ్లలో ఆనందం చూడటమే సీఎం కోరిక అన్నారు. సీఎం ఆదేశాలు, సూచనలతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందించడంతోపాటు భక్తులకు సౌకర్యాలు చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న ఈ పనుల వల్ల  రైతులకు ఎంతో మేలు చేకూరి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఆలయ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నాచారం గుట్ట ఆలయ సమీప హల్దీవాగు సుందరీకరణ, చెక్‌డ్యాం నిర్మాణంతోపాటు బతుకమ్మ ఘాట్లు, స్నానపుఘాట్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సుందరీకరణలో భాగంగా రూ 3.62 కోట్లతో చెక్‌డ్యాం, రూ 2.21 కోట్లతో స్నానపుఘాట్లు, రూ 14.5 లక్షలతో వాగులో పూడికతీతకు నిధులు వెచ్చించినట్లు వివరించారు. చెక్‌డ్యాం నిర్మాణంలో ఎల్‌ఎస్‌ ప్రొవిజన్స్‌ కింద రూ 150.50 లక్షలు కలిపి మొత్తం చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 7.48 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. దాదాపు 700 మీటర్ల ఈ చెక్‌డ్యాంలో నీరు నిలిచి ఉంటుందన్నారు. 

మంత్రికి పూర్ణకుంభ స్వాగతం
నాచారం గుట్ట సందర్శించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి, వేదపండిత పరివారంతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. నృసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం పొందారు. అనంతరం అక్కడి నుంచి శరన్నవరాత్రోత్సవ శోభతో అలరారుతున్న వర్గల్‌ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రాన్ని  సందర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి, ఎంపీలకు ఆలయం తరపున ఘన సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహదాశీర్వచనం చేశారు.   కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం చైర్మన్‌ భూపతిరెడ్డి,  బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి,  కొట్టాల యాదగిరి,  మామిండ్ల బాలమల్లు యాదవ్, మల్లేషం,  జాలిగామ లత రమేష్‌గౌడ్,  దేవగణిక నాగరాజు, నాచారం సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్‌గౌడ్, ఇరిగేషన్‌ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు