పరిమితికి లోబడే అప్పులు

14 Mar, 2020 02:47 IST|Sakshi

ఇసుక, రాజీవ్‌ స్వగృహ, దిల్‌ భూములు అమ్మి ఆదాయం పెంచుతాం 

ఇప్పటికే 1.23 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ 

మండలిలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి హరీశ్‌ సమాధానం 

ఉద్యోగులకు తక్షణమే ఐఆర్‌ ప్రకటించాలన్న జీవన్‌రెడ్డి 

ఉపాధ్యాయుల అరెస్ట్‌లకు నిరసనగా నర్సిరెడ్డి వాకౌట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అప్పులు కేంద్ర నిబంధనల పరిమితికి లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే రాష్ట్రం అప్పులు చేసిందని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారని తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీని దృష్టిలో పెట్టుకుంటే 25 శాతం వరకు అప్పులు తీసుకునే అవకాశమున్నా, రాష్ట్రం మాత్రం 21.3 శాతమే అప్పులు చేసిందన్నారు.

దేశంలో 24 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎంకు మించి అప్పులు చేశాయని, అప్పుల్లో రాష్ట్రం దిగువ నుంచి ఆరో స్థానంలో ఉందని వెల్లడించారు. శుక్రవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చకు హరీశ్‌ సమాధానమిచ్చారు. బడ్జెట్‌ ప్రజలకు ఆశాజనకంగా ఉంటే, ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అంతర్గత వనరులను పెంపొందించుకుంటూ, దుబారాను తగ్గిస్తామన్నారు. ముఖ్యంగా ఇసుక అమ్మకాలు, దిల్‌ భూములు, హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహాలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు.  

ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించాలి: టి.జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌  
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు పీఆర్‌సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో తక్షణమే 27 శాతం ఐఆర్‌ ప్రకటించాలి. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల్లో కొత్త రేషన్‌ దుకాణాలను మంజూరు చేయాలి. రూ.50 వేల రుణా లు తీసుకున్న రైతులకు రెండు విడతలుగా రుణమాఫీ చేయాలి. రేషన్‌ ద్వారా చక్కెర, పామాయిల్‌ పంపిణీ చేయాలి’అని కోరారు. 

ఉపాధ్యాయుల అరెస్ట్‌లకు నిరసనగా నర్సిరెడ్డి వాకౌట్‌.. 
అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్‌సీ ప్రకటించకపోవడం విచారకరమన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల అరెస్ట్‌లపై మంత్రి ప్రకటన చేయాలని కోరారు. ప్రకటన చేయనందుకు నిరసనగా ఆయన మండలి నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సైతం ఉద్యోగులకు పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలని కోరారు.

రూ.9,033 కోట్లు రావాలి... 
కేంద్రం నుంచి కోతలే తప్ప వచ్చిన నిధులేమీ లేవని, ఫిబ్రవరి నెలకు సంబంధించి జీఎస్టీ బకాయిలు రూ.9,033 కోట్లు రావాలని, 14వ ఆర్థిక సంఘం నిధులు సైతం రూ.395 కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.50 లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామని, ఇందులో 1.23 లక్షలను భర్తీ చేశామని, ఇవన్నీ రెగ్యులర్‌ ఉద్యోగాలేనని స్పష్టం చేశారు. మరో 27వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు సైతం గ్రామపంచాయతీల తరహాలో నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే నిర్మాణం మొదలు పెట్టిన 2.72 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తూనే కొత్తగా మరో లక్ష ఇళ్లను లబ్ధిదారుల సొంత స్థలాల్లో కట్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు