మిట్టపల్లికి.. హరీశ్‌రావు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

4 Sep, 2019 09:31 IST|Sakshi
 మిట్టపల్లి గ్రామంలో వినాయకుని పూజలో పాల్గొన్న హరీశ్‌రావు, తదితరులు

ఏకదంతుడి కోసం తీర్మానం చేసిన మొదటి గ్రామం మిట్టపల్లి

వినాయకుడి పూజల్లో పాల్గొన్న హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: గ్రామంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత ఉండేలా సామూహికంగా ఒకే ఒక మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని కొలుచుకోవాలని ఇచ్చిన పిలుపుతో ముందుకు వచ్చి ఏకదంతున్ని ప్రతిష్ఠించి మిగతా గ్రామాలకు మిట్టపల్లి స్ఫూర్తిగా నిలిచిందని, ఈ స్ఫూర్తిని రానున్న రోజుల్లో కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గ్రామ ప్రజలను కోరారు.  హరీశ్‌రావు, త్రిదండి దేవనాథ జీయర్‌ స్వామితో కలిసి సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒకే వినాయకుని సామూహిక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   సిద్దిపేటలో ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు.  తొలి రోజు పూజ శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్‌ స్వామి పర్యవేక్షణలో పూజ జరగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  40 గ్రామాలలో ఒకే వినాయకుని కోసం తీర్మానం చేశారన్నారు.  

ఈ స్ఫూర్తితో సిద్దిపేటలోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్‌ ప్రాంతాల్లోనూ ఒకే వినాయకుడు నినాదం మారు మోగిందని తెలిపారు.  తొలి రోజు పూజలో పాల్గొనడంతో పాటు ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం మిట్టపల్లి గ్రామ యువత కోసం వాలీబాల్‌ కిట్‌ను హరీశ్‌రావు అందించారు.  గ్రామంలోని పురాతన చెన్నకేశవ ఆలయాన్ని పునరుద్ధరణ పనులను దేవనాథ జీయర్‌ స్వామి వారితో కలిసి సందర్శించారు.  

ఈ ఆలయ నిర్మాణం కోసం రూ. 30 లక్షలు మంజూరు చేశామని, పనులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు.  వినాయక నవరాత్రుల సందర్భంగా రోజుకో కార్యక్రమం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారని, చిందు కళాకారుల కార్యక్రమం, జబర్ధస్త్‌ టీంతో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు, గ్రామ సర్పంచ్‌ వంగ లక్ష్మి, సిద్దిపేట అర్బన్‌ ఎంపీపీ వంగ సవితాప్రవీణ్‌రెడ్డి, మిట్టపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ ప్రవీణ్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ సంపత్‌యాదవ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు