తల్లీ.. దవాఖానాలో సౌలత్‌లు బాగున్నయా?

8 Mar, 2018 01:55 IST|Sakshi

నీటికోసం తండ్లాట వచ్చేయేడు నుంచి ఉండదు

సిద్దిపేటలో ఓ ఆడపడుచును పలకరించిన మంత్రి హరీశ్‌

సాక్షి, సిద్దిపేట: ‘అమ్మా బాగున్నావా.. మీ ఊరు గవర్నమెంట్‌ దవాఖానాలో సౌలత్‌లు బాగున్నాయా.. డాక్టర్లు మంచిగా చూస్తున్నరా.. కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నరా?’ అని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామంలో అనూష అనే ఉపాధి హామీ కూలీతో ప్రభుత్వాస్పత్రిలోని వైద్య సేవలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆరా తీశారు. బుధవారం మంత్రి హరీశ్‌ హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో పర్యటించి తోటపల్లి రిజర్వాయర్, గౌరవెల్లి, కాళేశ్వరం కాల్వల పనులు పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేశామని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని చెప్పారు. కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట, హుస్నాబాద్‌ ప్రజలు నీటికోసం తండ్లాడే పరిస్థితి ఇక ఉండదన్నారు. మిడ్‌మానేరు ద్వారా 75 వేల ఎకరాలు, గౌరవెల్లి ద్వారా మరో 75వేల ఎకరాలకు వచ్చే వానాకాలం నుంచి నీరు అందించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు.

గత ప్రభుత్వాలు 30 ఏళ్లలో చేయని పని ముఖ్యమంత్రి సంకల్ప బలంతో మూడేళ్లలో చేశామని చెప్పారు. యజ్ఞం లా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేస్తున్నామని ఎప్పుడూ ఎండిపోయి బోసిపోయి ఉన్న చెరువులు ఇక నీటితో నిండుకుండలా ఉంటాయని మంత్రి వివరించారు. మిడ్‌మానేరు పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయన్నారు. శ్రీరాంసాగర్‌ వరద కాలువల్లో భాగమైన మిడ్‌ మానేరులో 25 గేట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ శుభకార్యం రోజును చెట్లు నాటే ఆనవాయితీ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు