త్యాగధనుల రుణం తీర్చుకుంటాం

2 May, 2018 02:35 IST|Sakshi

‘కాళేశ్వరం’లో భూములు కోల్పోయిన వారి బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలనే తపనతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు.. దాని అనుబంధ రిజర్వాయర్ల నిర్మాణాల కోసం భూములు, గ్రామాలు త్యాగం చేసిన వారికి రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటుంది. వారి రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచిస్తుంది’అని నీటి పారుదల, మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో రైతు సమన్వయ కమిటీలతో రైతు బంధు పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో భూము లు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఉపాధిలో భాగంగా ఇళ్లు కట్టిస్తున్నామని, వారి పిల్లలకు ఉద్యోగాల కల్పనలో కృషిచేస్తామన్నారు. గతంలో మే నెల రాగానే రైతుల గుండెల్లో గుబులు మొదలయ్యేదని, చినుకు పడే నాటికి పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాల్సి ఉండగా, ఎరువులు, విత్తనాలు, అప్పుల కోసం ఇబ్బందులు పడేవారన్నారు. వారి బాధలను చూసిన సీఎం కేసీఆర్‌ రైతు బంధు పథకం కింద సాగుకు సమయం రాకముందే రైతులకు డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మే 10న రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాలు అందచేస్తామని చెప్పారు. ఈ పథకం చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోతున్నా రని, అక్కడ కూడా ఈ పథకం అమలు చేసేందుకు సలహాలు, సూచనలు అడుగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఒడిదల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మంత్రి సుడిగాలి పర్యటన..
సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్‌ ఓపెన్‌ టాప్‌ జీప్‌లో సుడిగాలి పర్యటన చేశారు. తానే స్వయంగా జీపు నడుపుతూ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు