పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

12 Sep, 2019 08:07 IST|Sakshi
మంత్రికి టవల్, పుస్తకాలను అందించి అభినందిస్తున్న దృశ్యం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హరీశ్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చే అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పూలదండలు, బొకేలతో రావడంతో పూలదండలు, బొకేలకు బదులుగా నోట్‌పుస్తకాలు, శాలువాలకు బదులుగా టవల్స్‌ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురికి నచ్చేలా, నలుగురు మెచ్చేలా మంచి చేద్దామన్నారు. మీరిచ్చే నోట్‌బుక్కులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నేత కార్మికుడు నేసిన తువ్వాలలు తేవడం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అతిథులకు పూలబోకేలు ఇచ్చి ఆహ్వానించటం అనవాయితీగా ఉందని, కానీ అలాంటి అనవాయితీకి స్వస్తి పలకాలని హరీశ్‌రావు సూచించారు. 

మంత్రికి అభినందనలు తెలిపిన సీపీ
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌రావును బుధవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్, అడిషనల్‌ డీసీపీ నరసింహారెడ్డి, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ బాబురావు, ఏసీపీ రామేశ్వర్, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్, టూటౌన్‌ సీఐ ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు