యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి 

2 Nov, 2017 02:38 IST|Sakshi
ఇరిగేషన్‌పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి, కడియం, హరీశ్‌రావు

     పాలకుర్తి, చెన్నూరు, ఉప్పుల రిజర్వాయర్ల పనులలో జాప్యంపై  హరీశ్‌ అసంతృప్తి

     జంపన్న వాగు చెక్‌ డ్యామ్‌లు మేడారం జాతరలోపు పూర్తి చేయాలని సూచన  

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని చెన్నూరు, పాలకుర్తి, ఉప్పుల రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధి కారులను ఆదేశించారు. ఆయా రిజర్వాయర్ల పనులను పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు గడువులోగా పనులు పూర్తి చేయకపోతే వెంటనే ఆ ఏజెన్సీని తొలగించి వేరే ఏజెన్సీకి పనులు అప్పగించాలని ఆదేశించారు. ఈ పనులపై సంబంధిత ఏజెన్సీతో ఈనెల 6న మళ్లీ సమీక్షిస్తామని తెలిపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో పాలకుర్తి, మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో సాగు నీటి పథకాలు, దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల పనులను హరీశ్‌ సమీక్షించారు.

పాలకుర్తి నియోజకవర్గంలో 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్న మల్కాపూర్‌ రిజర్వాయర్‌ సర్వే నివేదికపై సమీక్షిస్తూ, 2 రోజుల్లో సర్వే నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని వ్యాప్కోస్‌ సంస్థను ఆదేశించారు. ఈ నివేదిక అందిన వెంటనే పను లను ప్రారంభించాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్‌– 3 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాల వల్ల ఆలస్యమైన తుపాకులగూడెం బ్యారేజీ పనులను వేగవంతం చేయాలన్నారు. జంపన్నవాగుపై తలపెట్టిన 4 చెక్‌ డ్యామ్‌లను ఫిబ్రవరిలో జాతరకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు.

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరువులకు ప్రతిపాదించిన ఫీడర్‌ చానళ్ల పనులన్నీ మిషన్‌ కాకతీయ నాలుగో దశ కింద చేపట్టాలని మంత్రి కోరారు. దేవాదుల ప్రాజెక్టులో ఇంకా పూర్తికాని భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత విజ్ఞప్తి మేరకు తపాసుపల్లి ప్రాజెక్టు నుంచి బొందుగుల, కుర్రారం, సింగారం గ్రామాల చెరువులను నింపేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు