‘30 రోజుల ప్రణాళికతో ప్రగతి బాగుంది’

25 Oct, 2019 17:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు జిల్లాలో 30 రోజులు ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి గ్రామాల్లో సాధించిన ప్రగతి బాగుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. కేవలం 30 రోజుల్లో కలనా? నిజమా? అనేలా గ్రామాల్లో ప్రగతి విప్లవంలా జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఘనత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావుకే దక్కిందని అన్నారు. 

తెలంగాణలోని 24 గంటలు విద్యుత్‌, రైతు బంధు పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి ఆయా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌.. తెలంగాణ ప్రభుత్వం చేసిన  అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పటివరకూ సంగారెడ్డి జిల్లాలో 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి పనులను కేసీఆర్‌ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో చేసి చూపెట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం ఉన్న కారణంగానే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక గెలిచామన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

మరిన్ని వార్తలు