‘పట్నం’లో నేడు హరిత పండుగ

8 Aug, 2019 10:45 IST|Sakshi
నర్సరీల్లోని మొక్కలను నాటేందుకు తరలింపు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పూర్తయిన ఏర్పాట్లు

నర్సరీల నుంచి గ్రామాలకు చేరిన మొక్కలు

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ 

ఆరు లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం 

సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గురువారం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాలతో పాటు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలలో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఆయా గ్రామాలకు సరఫరా చేశారు.


గ్రామాలకు తరలించేందుకు మొక్కలను వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యం

హరితహారంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకే రోజు ఆరు లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి అడుగులు వేశారు. డ్వాక్రా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని, ప్రభుత్వ, ప్రైౖవేటు స్థలాల్లో, రోడ్ల వెంట, పార్కు స్థలాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీల నుంచి మొక్కలను ఆయా గ్రామాలకు తరలించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం కూడా పూర్తయ్యింది.  ఈ కార్యక్రమానికి గ్రామస్థాయిలో నోడల్‌ అధికారులను నియమించారు. 

నాగన్‌పల్లి వద్ద గుంతలు తవ్వుతున్న కూలీలు

హాజరుకానున్న ప్రియాంక వర్గీస్‌ 
స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మన్నెగూడ సెంట్రల్‌ రోడ్డు డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి, అనంతరం రాయపోల్‌ అటవీశాఖ భూముల్లో మొక్కలు నాటుతారు. గున్‌గల్‌ ఫారెస్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీ‹స్‌ పాల్గొంటారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లిలో పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంచాల మండలంలో జిల్లా పంచాయతీ అధికారిణిæ పద్మజారాణి, లోయపల్లిలో గీత కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రఘురాం, తుర్కగూడ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలో ట్రాన్స్‌కో డీఈ సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ అమరేందర్, చర్లపటేల్‌గూడలో స్థానిక ఏసీపీ యాదగిరిరెడ్డి, మంగళ్‌పల్లి అటవీ భూముల్లో జిల్లా ఫారెస్టు అధికారి తదితరులు పాల్గొని మొక్కలు నాటనున్నారు.  

హరిత పండుగలో అందరూ పాల్గొనండి  
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇబ్రహీంపట్నంలో జరగబోయే హరితపండగను జయప్రదం చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలి. డ్వామా, ఈజీఎస్, అటవీశాఖల అధికారులు ఆరు లక్షల మొక్కలు నాటడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా గోతులు తవ్వించి సిద్ధంగా పెట్టారు. హరితహారం విజయవంతం చేయడానికి వరణుడు కూడా సహకరిస్తున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలి. ముఖ్యమంత్రి మెచ్చుకునేలా మన హరితహారం పండగ జరగాలి. ఉదయం పది గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాలి.  
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం   

మరిన్ని వార్తలు