ఉద్యమంలా హరితహారం

28 Jun, 2015 00:53 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ను ఉద్యమంలా చేపట్టాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు జీవంపోసే వృక్షసంపదను కాపాడుకునేందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అభిలషించారు. జెడ్పీ సమావేశమందిరంలో శనివారం హరితహారంపై ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య ఆతిధిగా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2.34 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 20 లక్షల గుంతలు తవ్వి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచామని అన్నారు.
 
 మొక్కలను నాటడం కాదు.. సంరక్షించడం ముఖ్యమని, ఈ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం.. నాటిన మొక్కలను పోషించే బాధ్యతను గ్రామీణ ఉపాధి హామీతో అనుసంధానం చేసిందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. వృక్ష సంపద లేకపోవడం వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటేలా ప్రజలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అడవులు అంతరించిపోవడం వల్ల కోతులు గ్రామాల్లో సంచరిస్తున్నాయని, అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను పెంచేందుకు అటవీశాఖ కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మట్లాడుతూ కళాశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
  సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, వివేక్, కనకారెడ్డి, గాంధీ, సుధీర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ శ్రీనివాస్, జేసీ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ వర్షిణి, వివిధ శాఖల అధికారులు, పురపాలికల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హరితహారం అమలుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొం దించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
 
 డీపీఓపై గుస్సా!
 జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి వ్యవహారశైలిపై మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో లేచి నిరసన తెలిపారు. చేవెళ్ల ఎంపీపీని చాంబర్‌లోకి అనుమతించకుండా డీపీఓ అవమానపరిచారని సభ్యులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల కు కనీస గౌరవం ఇవ్వని డీపీఓ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి.. ఈ అంశంపై సమావేశంలో చర్చించడం సబబుకాదని సముదాయించడంతో ఎంపీపీలు శాంతించారు.
 

>
మరిన్ని వార్తలు