సంరక్షణే సవాల్‌!

19 Jun, 2019 10:37 IST|Sakshi

హరితహారం పథకం కింద గతేడాది జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఉపాధి హామీ నిధులతో నాటిన 90.43 లక్షల మొక్కల్లో 35.69 లక్షల మొక్కలు బతికినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే నాటిన మొక్కల్లో 39 శాతం మొక్కలు మనుగడ సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవాని కి 20 శాతం కూడా మొక్కలు మనుగడ సాధించలేదు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో హరితహారం పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ సవాల్‌గా మారింది. రూ.కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నప్పటికీ.. అవి నాటుకుని మనుగడ సాధించడం లేదు. నాటినప్పుడు ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో ఉండటం లేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఏటా కోట్లలో మొక్కలు నాటుతోంది. ఒక్కో గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు ఏటా నాటుతూ వస్తోంది. కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, పాఠశాలలు, ఇతర  సంస్థల ప్రదేశాలు, దేవాలయాలు, ఈత వనాలు, రహదారికి ఇరువైపున ఉన్న ఖాళీ స్థలాలు, రైతుల పొలం గట్ల మీద ఇలా వివిధ ప్రదేశాల్లో ఏటా భారీ సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. కానీ మొక్కలు మూడు రోజుల ముచ్చటే  అవుతోంది. మొక్కలు నాటడంలో చూపిన ఉత్సాహం వాటి సంక్షరణపై పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది రెండింతల లక్ష్యం 
ఈ ఏడాది హరితహారం లక్ష్యం రెండింతలైంది. ఏటా నాటే మొక్కల సంఖ్య కంటే రెండు రెట్లు అధికంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో హరితహారం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఏటా 1.85 కోట్ల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈసారి ఏకంగా 4.80 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం అటవీశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో అటవీశాఖ పడింది. మరోవైపు లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద నర్సరీల పెంపకంతో పాటు అటవీశాఖ నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు.

మరిన్ని వార్తలు