బాధితులకు ఈటల, హరీశ్‌ పరామర్శ

5 Sep, 2017 01:47 IST|Sakshi
బాధితులకు ఈటల, హరీశ్‌ పరామర్శ

హైదరాబాద్‌: భూ పంపిణీలో న్యాయం జరగలేదని ఆత్మహత్యకు యత్నించి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, పరశురాంను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వినోద్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడేం దుకు నిరాకరించారు.  

చిన్న మనస్పర్థల వల్లే.. : ఈటల
భూపంపిణీలో స్థానికంగా నెలకొన్న చిన్న మనస్పర్థలతోనే ఈ ఘటన చోటుచేసుకుందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇది క్షణికావేశంలో జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల కంటే మానకొండూర్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా భూపంపిణీ జరిగిందని చెప్పారు. భూ పంపిణీతో ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు.

అపోహతోనే అలా చేశారు: రసమయి  
మానకొండూరు నియోజకవర్గంలో విడతలవారీగా భూపంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి అన్నారు. భూమి దొరకని చోట రైతులను బ్రతిమిలాడి కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. శ్రీనివాస్‌కు కూడా ఎకరం 10 గుంటల భూమి కేటాయించినట్లు చెప్పారు. తనకు తక్కువ భూమి వస్తోందనే అభద్రతకు గురై ఆత్మహత్యకు యత్నించారని చెప్పారు. తాను దళితుడినేని, తన జాతి బాగుపడాలనే ఉద్దేశంతో ఈ పథకం కోసం ఎంతో శ్రమించానని రసమయి చెప్పారు.

మరిన్ని వార్తలు