మూడో పెళ్లిపై నిలదీస్తే జుట్టుపట్టి.. ఈడ్చిపడేశాడు

20 Nov, 2017 08:41 IST|Sakshi

భార్యపై టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి దాష్టీకం 

భార్యకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు 

నిలదీసిన భార్య సంగీత, ఆమె సోదరునిపై దాడి 

నాలుగేళ్లుగా మానసికంగా, శారీరకంగా సంగీతకు వేధింపులు 

నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

మేడిపల్లి ఠాణా పరిధిలో ఘటన

హైదరాబాద్‌: అతడో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. పైగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు.. తొలి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు.. అయితే పెళ్లైనప్పటి నుంచీ అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు.. అత్తింటి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. అయితే రెండో భార్యకు తెలియకుండా ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడా ప్రబుద్ధుడు. తనకు విడాకులివ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నావని నిలదీసినందుకు రెండో భార్యను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చిపడేశాడు. ఆమెపై.. ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి ఠాణా పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే.. 
పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌ శ్రీనగర్‌కాలనీలో నివసించే పులకండ్ల బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తాడు. తొలుత స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నా.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. 2013 అక్టోబర్‌ 19న శేర్‌లింగంపల్లి సుందరయ్యనగర్‌కు చెందిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప ఉంది. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ బాల్‌రెడ్డి, ఐలమ్మ, ఆడబిడ్డ భాగ్యలక్ష్మి.. సంగీతను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వేధింపులపై ఈ ఏడాది జూన్‌ 13న చందానగర్‌ పోలీసులకు సంగీత ఫిర్యాదు చేసింది. ఇదిలాఉండగా బోడుప్పల్‌కు చెందిన దేవిజగదీశ్వరి(20)ని ఆగస్ట్‌ 11న శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని సంగీత మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వరి, భాగ్యలక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. బాల్‌రెడ్డి, ఐలమ్మ కోర్టులో లొంగిపోయి బెయిల్‌పై బయటకొచ్చారు. 

భర్త ఇంటి వద్ద నిరాహార దీక్ష 
బెయిల్‌పై బయటకొచ్చిన శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వరితో కలసి ఉంటున్నాడు. దీంతో సంగీత, ఆమె తల్లి పద్మ, తమ్ముడు రంజిత్‌రెడ్డి ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబసభ్యులకు, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య మాటామాటా పెరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన సంగీతను శ్రీనివాసరెడ్డి, అత్త ఐలమ్మ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అడ్డుకున్న సంగీత సోదరునిపైనా శ్రీనివాస్‌రెడ్డి దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐలమ్మ పరారీలో ఉంది. సంగీత, రంజిత్‌లను ఆస్పత్రికి తరలించారు. 

భార్యను దారుణంగా కొట్టి ఇంటి నుండి గెంటిశాడు 

మరిన్ని వార్తలు