కార్బైడ్‌ వినియోగిస్తే  కఠిన చర్యలే 

22 Mar, 2019 01:31 IST|Sakshi

పారిశ్రామిక అవసరాలు మినహా మిగిలిన వాటికి వాడరాదు 

కార్బైడ్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌ : వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్‌ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్‌ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్‌ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) గా పరిగణించింది.

దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీఎస్‌ïపీఎస్‌సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్‌ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది.   

మరిన్ని వార్తలు