ఆడిట్.. అభ్యంతరాలు

31 May, 2014 03:19 IST|Sakshi

 హన్మకొండ, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ లో ఏటా నిర్వహించే ఆడిట్ చేసే కాగ్ ఈసారి పలు అం శాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హన్మకొండలోని విద్యుత్ భవన్‌లో దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆడిట్‌కు కాగ్ తరఫున ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రెండు బృందాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా బృందా ల  అధికారులు తమ పరిశీలనలో పలు విభాగాల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సమాధానాలు కోరారు. ప్రధానంగా ధరల పెంపుదల, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించడమే కాకుండా పలు సామగ్రి కొనుగోళ్లలో ఎక్కువ ధరలు పెట్టినట్లు అనుమానిస్తూ వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

అయితే, వీటిలో కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన ఎన్పీడీసీఎల్ అధికారులు మరికొన్నింటిని దాటవేశారు. కాగా, ఆడిట్ విభాగం అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం ఉన్నతాధికారులు పాత రికార్డులను వెలికి తీస్తుండగా, ఆయా విభాగాల్లో పని చేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా కాగ్ బృందాలు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల వివరాలు...
 
 కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

 జిల్లాలో హెచ్‌వీడీఎస్, ఆర్‌ఏపీడీఆర్‌పీతో పాటు జైకా పనుల్లో కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆడిట్ విభాగం తప్పు పట్టింది. ఏళ్లు గడిచినా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారని మందలించింది. దీనిలో భాగంగానే ఆర్‌ఏపీడీఆర్‌పీలో పార్ట్-ఏ ఐటీ పనులు చేయడంలో ఆలస్యం చేసిన టీసీఎస్ సంస్థ పనితీరు, అధికారుల పర్యవేక్షణ ను ఆడిట్ అధికారులు తప్పు పట్టారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు కూడా చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ నే సంస్థకు 17సార్లు నోటీసులు జారీ చేసి ఎలాంటి చ ర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అదే విధం గా హెచ్‌వీడీఎస్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్ల పనులు చేస్తున్న యూడబ్ల్యూటీతో పాటు మరో కాంట్రాక్ట్ సంస్థ పనుల ఆలస్యంపై సైతం వివరాలు అడిగారు.
 
 ధరల పెంపు
 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి 29 శాతం ధరలు పెంచడాన్ని కూడా కాగ్ ఆడిట్ విభాగం తప్పు పట్టింది. ఏ ప్రాతిపదికగా ధరలు పెంచారని ప్రశ్నిస్తూ.. ధరలు పెంచినా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడం, దీనిపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. అదే విధంగా ఐఆర్‌డీఏ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో ఎక్కువ ధర పెట్టిన వైనంపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందని, విచారణ నివేదికల ప్రకారం ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఎన్పీడీసీఎల్‌లో గత ఏడాది వెలుగులోకి వచ్చిన కేబుల్ వ్యవహారంలో ఇంకా ఎన్ని రోజులు విచారణ చేస్తారని ఆరా తీశారు. కాగ్ ఆడిట్ ప్రశ్నలకు ఎన్పీడీసీఎల్ అధికారులు కొన్ని సమాధానాలు ముందుంచారు. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడితే... పనులు సాగడం కష్టమవుతుందని నివేదించారు. అదే విధంగా కేబుల్ వ్యవహారంలో విచారణ సాగుతుందని సమాధానం ఇచ్చారు. మిగిలిన వాటిపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

మరిన్ని వార్తలు