పాత ప్రత్యర్థుల..కొత్త పోరు..

14 Nov, 2018 18:26 IST|Sakshi

జిల్లాలో ఆసక్తిగా ఎలక్షన్‌ వార్‌ప్రధాన పార్టీల జాబితా వెల్లడిగత అభ్యర్థులే మరోసారి పోటీలోకి..

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పాత ప్రత్యర్థులే మరోసారి కొత్తగా బరిలోకి దిగుతున్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ఎన్నికల పోరుపై స్పష్టత వచ్చింది. గత ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులే మళ్లీ ఈసారీ తలపడుతుండడం విశేషం. ఇందులో కొంతమంది ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగుతుంటే, మరికొందరు అదే పార్టీ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. పాత ప్రత్యర్థుల తాజా పోరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. 

‘దుద్దిళ్ల’.. ‘పుట్ట’ల హ్యాట్రిక్‌ పోటీ...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పుట్ట మధులు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఎన్నికల గోదాలోకి దిగిన శ్రీధర్‌బాబు, మధులు వరుసగా మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ చెరోసారి విజయం సాధించడం గమనార్హం. 2009లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ నుంచి, పుట్ట మధు ప్రజారాజ్యం నుంచి పోటీపడగా, మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ నుంచే పోటీ చేయగా, మధు టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో శ్రీధర్‌బాబుపై పుట్ట మధు గెలుపొందారు. కాగా.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి పుట్ట మధు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు.

రామగుండంలో త్రిమూర్తులు..
రామగుండం నియోజకవర్గంలోనూ పాత ప్రత్యర్థులే మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీపడిన సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌లు మరోసారి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో సోమారపు టీఆర్‌ఎస్‌ నుంచి, కోరుకంటి ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ స్వతంత్రుడిగా పోటీ చేశారు. చందర్‌పై సత్యనారాయణ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కోరుకంటి చందర్‌ తొలిసారి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, పీఆర్‌పీ అభ్యర్థి కౌశిక హరిపై గెలుపొందారు. ఈఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌ పోటీపడుతుండగా, టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థిగా మరోసారి కోరుకంటి చందర్‌ బరిలో ఉండనున్నారు. ఇందులో సోమారపు, చందర్‌లు మూడోసారి, సోమారపు, చందర్, మక్కాన్‌సింగ్‌లు వరుసగా రెండోసారి పోటీపడుతున్నారు.

పెద్దపల్లిలో మాజీల ఫైట్‌...
పెద్దపల్లిలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థిత్వాలు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి చింతకుంట విజయరమణారావు, బీజేపీ నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, టీడీపీ నుంచి చింతకుంట విజయరమణారావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.భానుప్రసాద్‌రావుపై మనోహర్‌రెడ్డి విజయం సాధించారు. ఈఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మరోసారి బరిలోకి దిగుతుండగా, విజయరమణారావు కాంగ్రెస్‌ నుంచి పోటీపడుతున్నారు. వరుసగా వీరిరువురు రెండోసారి తలపడుతుండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల తరపున పాత ప్రత్యర్థులే మరోసారి పోటీపడుతుండడంతో జిల్లాలో రాజకీయం ఆసక్తిగా మారింది. 

మరిన్ని వార్తలు