అగ్రస్థానం అనుమానమే..?

2 Mar, 2019 09:40 IST|Sakshi

‘పది’ ఫలితాల్లో వరుసగా రెండేళ్లు

అగ్రస్థానంలో జిల్లా  ఫలించిన ‘ఉత్తేజం’ 

ఈసారి ప్రోత్సాహం అంతంతే !

అగ్రస్థానం అనుమానమే..ఈనెల 16 నుంచి పరీక్షలు  

సాక్షి, జగిత్యాలపదోతరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా రెండుసార్లు అగ్రస్థానంలో నిలిచింది. గతంలో కలెక్టర్‌ శరత్‌ చొరవతో చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం సత్పలితాలనిచ్చింది. ఈనెల 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్రంలో మళ్లీ అగ్రస్థానంలో నిలిస్తే ముచ్చటగా మూడోసారి(హ్యాట్రిక్‌) నంబర్‌వన్‌గా నిలిచే అవకాశం దక్కుతుంది. అయితే గతంలో మాదిరిగా ఉత్తేజం కార్యక్రమానికి కలెక్టర్‌ నిధులు మంజూరు చేయకపోవడంతో స్థానిక దాతల నుంచి నెట్టుకొచ్చారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండడం.. కొన్ని పాఠశాలల్లో సిలబస్‌ కూడా పూర్తికాకపోవడం నంబర్‌వన్‌ సాధించడంపై అనుమానాలు కలుగుతున్నాయి.

వరుసగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్‌గా నిలుస్తోంది. 2016–17 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాలలో జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. మరుసటి సంవత్సరం 2017–18 ఫలితాల్లోనూ 97.56 ఉత్తీర్ణతశాతంతో జగిత్యాల జిల్లా రెండోసారి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది. వీరిలో బాలికలు 98శాతం ఉత్తీర్ణత కాగా బాలురు 97 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 201 ప్రభుత్వ పాఠశాలల్లో 117 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

ఉత్తేజంతో ఊపు.. 
పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తేజం కార్యక్రమంతో పది విద్యార్థులకు పాఠశాల సమయానికి గంట ముందు, తర్వాత స్టడీఅవర్స్‌లో చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఆ సమయంలో వారికి స్నాక్స్‌ అందించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. కలెక్టర్‌ నిధులతోపాటు విస్త్రృతమైన ప్రచారంతో దాతలు ముందుకు రావడంతో సాయంత్రం వేళ విద్యార్థుల ఆకలి తీరింది. ఫలితంగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది.

మాస్‌ కాపీయింగ్‌ మరకలు 
గతేడాది మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షాసమయంలో జిల్లాలోని కొడిమ్యాల మండలంలో జరిగిన మాస్‌కాపీయింగ్‌ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు ఎన్నడు లేని విధంగా ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం కలకలం రేపింది. జిల్లాను ఫలితాల్లో నంబర్‌వన్‌గా ఉంచాలనే ఒత్తిడితో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  

ఉత్తేజం అంతంతే! 
గత రెండేళ్లుగా జిల్లాలో పదోతరగతి విద్యార్థుల కోసం చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. కలెక్టర్‌ శరత్‌ రెండేళ్లపాటు ఉత్తేజం కోసం ఏటా సుమారు రూ.15 లక్షలు కేటాయించారు. వీటితోపాటు ఆయా మండలాలు, గ్రామాల్లో స్థానిక నాయకులు, దాతల నుంచి విరాళాలు భారీగా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించలేదు. కేవలం గ్రామస్థాయిల్లో దాతల విరాళాలతో నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా లభించిన ప్రచారం, ప్రోత్సాహం ఈ దఫా కరువైనట్లు కనిపిస్తోంది. దీనికితోడు ఈసారి ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవడం.. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇప్పటి వరకు సిలబస్‌ పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్‌ సాధించడం కష్టతరంగా మారింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు