చిగురిస్తున్న ‘పవర్’ ఆశలు

17 Mar, 2015 01:22 IST|Sakshi
చిగురిస్తున్న ‘పవర్’ ఆశలు
  • విద్యుత్ ప్లాంట్లకు నేడు పర్యావరణ అనుమతి!
  • మెగావాట్‌కు 0.63 ఎకరాల భూమి.. రూ. 6.1కోట్ల ఖర్చు
  • సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కృష్ణా నదితీరంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఆశలు చిగురుస్తున్నాయి. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా భావించిన అటవీభూముల బదలాయింపు అంశం ఓ కొలిక్కి రావడం.. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రుణంగా ఇచ్చేందుకు జాతీయ విద్యుత్ సంస్థలు కూడా అంగీకరించడంతో ప్రాజెక్టు పనులకు త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈ ప్రాజెక్టుకు మంగళవారం అనుమతి ఇస్తుందన్న వార్తలు జిల్లా యంత్రాంగంలో, ఇక్కడి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
     
    ప్రతిపాదించి మూడు నెలలే..

    వాస్తవానికి జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్‌పూర్ అటవీ ప్రాంతంలో జెన్‌కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు అవసరమైన 8,700 ఎకరాలకు అదనంగా మరో 1,300 కలిపి మొత్తం 10 వేల ఎకరాలు సర్వే చేశారు. తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అటవీభూమికి పరిహారంగా ఇవ్వాల్సిన భూమిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.

    జిల్లాలోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి మొత్తం 14,500 ఎకరాలను గుర్తించింది. ఈ నివేదికను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర అటవీ శాఖకు పంపింది. జిల్లాలోని 18 మండలాల్లో గుర్తించిన ఈ భూమిలో ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకునే భూమికి  పరిహారంగా అంతే భూమిని తీసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆ ప్రతులు జనవరిలో బెంగళూరులోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాయి. అక్కడి నుంచి అధికారులు ఫిబ్రవరిలో వచ్చి జిల్లా యంత్రాంగం చూపిన భూములను పరిశీలించి తమ నివేదికను మళ్లీ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపారు. దీంతో అటవీభూముల బదలాయింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది.   
     
    18 మండలాలు.. 6,300 ఎకరాలు

    ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 6,300 ఎకరాలు కావాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన విద్యుత్ అధికారులు చెప్పిన విధంగా మెగావాట్‌కు 0.67 ఎకరాల చొప్పున 6,800 మెగావాట్లకు 6,300 ఎకరాలు సరిపోతుందని అంచనా. అయితే, దామరచర్ల మండలంలో తీసుకోవాల్సిన ఈ భూమి అటవీభూమి కావడంతో దీనికి పరిహారంగా జిల్లాలోని 18 మండలాల్లో 14 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని గుర్తించారు. దేవరకొండ, చందంపేట, డిండి, మర్రిగూడ, నాంపల్లి, సంస్థాన్ నారాయణ్‌పూర్, పెదవూర, మిర్యాలగూడ, జాజిరెడ్డిగూడెం, నడిగూడెం, పెన్‌పహాడ్, తిరుమలగిరి, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, భువనగిరి, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో గుర్తించిన ఈ భూముల నుంచి మొత్తం 6,300 ఎకరాలను అటవీశాఖకు బదలాయించనున్నారు.
     
    పైసలు కూడా ఇస్తామన్నారు: మరోవైపు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ.50 వేల కోట్లను సమకూర్చుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతున్నాయి. మొత్తం 6,800 మెగావాట్లకు గాను మెగావాట్‌కు రూ.6.1 కోట్ల చొప్పున మొత్తం రూ.42 వేల కోట్లు అవసరం కానున్నాయి. దీంతోపాటు 600 ఎకరాల్లో టౌన్‌షిప్ కూడా ఏర్పాటు చేయనున్నారు. టౌన్‌షిప్‌లో నివాస సముదాయాలతో పాటు పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ టౌన్‌షిప్ ఏర్పాటుతోపాటు ఇతర అవసరాలకు రూ.50 వేల కోట్ల అవసరం కానున్నాయి.

    ఇందులో రూ.9 వేల కోట్లను ప్రాథమికంగా రుణంగా ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) జెన్‌కోతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మరో రూ.10 వేల కోట్లకు పైగా రుణం ఇచ్చేందుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) కూడా త్వరలోనే జెన్‌కోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతి, నిధులు సమకూరనుండడంతో త్వరలోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరుగుతుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు