గజగిరిగుట్టలో రాతి మనిషి గుట్టు!

8 Apr, 2018 02:47 IST|Sakshi
జనగామ సమీపంలోని గుట్టపై పురాతత్వ ఆనవాళ్ల కోసం పరిశీలన జరుపుతున్న పరిశోధక బృందం

బృహత్‌ పరిశోధనకు హెచ్‌సీయూ శ్రీకారం

జనగామ చేరువలోని గుట్టలో తవ్వకాలు  

వేల ఏళ్ల నాటి ఆహారం, పర్యావరణంపై పరిశోధన

సాక్షి, హైదరాబాద్‌: 4,000 ఏళ్ల క్రితం రాతియుగం మనిషి ఏం తిన్నాడు? చిరుధాన్యాలు వాటంతటవే పెరిగాయా.. సాగు చేసేవారా..? వరి సాగు ఎప్పుడు మొదలైంది? అసలు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇలాంటి ఆసక్తికర విషయాల నిగ్గు తేల్చే అన్వే షణ ఇప్పటివరకు దక్షిణ భారతంలో జరగలేదు. వేల ఏళ్ల నాటి మానవ అవశేషాల ఆధారంగా కొన్ని అం శాలు తెలుసుకున్నా ఆ నాటి పర్యావరణం, జీవ జాలం, ఉపద్రవాలపై పక్కా ఆధారాలు సేకరించే అధ్యయనాలు చేయలేదు. కానీ తొలిసారి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ (హెచ్‌సీయూ) ఇందుకు నడుం బిగించింది. ఆది మానవుల మనుగడలో కొత్త కోణాలు ఆవిష్కరించే బృహత్‌ అన్వేషణను మొదలు పెట్టింది. తవ్వకాల్లో సేకరించే ఆధారాల విశ్లేషణకు లండన్‌ వర్సిటీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది.

వేల ఏళ్ల నాటి ధాన్యపు గింజలు, పుప్పొడి, మానవులు, జంతువుల అవశేషాల ఆధారంగా ఆహారపు అలవాట్లు, మనుగడ, జీవజాలాన్ని చెల్లాచెదురు చేసిన ప్రకృతి విపత్తులు.. ఇలా అన్ని అంశాలను పరిశోధించబోతోంది. ఇందుకు జనగామ సమీపంలో కొన్నె, రామచంద్రాపురం శివారులోని గజగిరిగుట్టను ఎంచుకున్నారు. పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లభించడంతో హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ కె.పుల్లారావు ఆధ్వర్యంలో వర్సిటీ పరిశోధక విద్యార్థుల బృందం శనివారం ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది.

ఈ గుట్టపై వేల ఏళ్లనాటి మానవ ఆవాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద దాన్ని రూఢీ చేసే ఆధారాలు గతంలో లభ్యమయ్యాయి. బూడిదగుట్టగా మారిన ప్రాంతంపై గతంలో ప్రొఫెసర్‌ పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రాథమిక అధ్యయనంలో.. తొలి చారిత్రక యుగం, బృహత్‌ శిలాయుగం, కొత్తరాతియుగాలకు చెందిన ఆవాసా లు అక్కడ ఉన్నట్లు తేలింది. అక్కడి భూమిలోని ఒక్కో పొర ఒక్కో కాలం ఆధారాలు అందించే అవకాశం ఉండటంతో అధ్యయనానికి ఈ ప్రాం తమే అనువైనదని హెచ్‌సీయూ గుర్తించింది. గతంలో ఓ సదస్సులో లండన్‌ వర్సిటీ చరిత్ర విభాగాధిపతి డోరియన్‌ ఫుల్లర్‌తో ప్రొఫెసర్‌ పుల్లారావు భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ అన్వేషణలో సేకరించిన నమూనాలను ఆ వర్సిటీ ల్యాబ్‌లలో ఆధునిక పద్ధతుల్లో విశ్లేషించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎలా విశ్లేషిస్తారు..?
సాధారణంగా ధాన్యం గింజపై చిన్న బొడిపె ఉంటుంది. మొక్కతో గింజను అనుసంధానించేది ఈ బొడిపే. మట్టి పొరల్లో ఆ బొడిపె తాలూకు అవశేషాలు, పుష్పాల పుప్పొడి అవశేషాలు సేకరిస్తారు. వీటిలో చాలా అవశేషాలు కంటికి కనిపించవు. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ద్వారానే విశ్లేషించగలుగుతారు. అలాగే ‘యాక్సలేటర్‌ మాస్‌ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్‌)’విధానాన్నీ అనుసరించనున్నారు. ఇందుకు లండన్‌ వర్సిటీ సహకరించనుంది. 

మరిన్ని వార్తలు