పట్నవాసుల పల్లెబాట

15 Jan, 2020 09:37 IST|Sakshi
రద్దీ లేక బోసిపోయిన ప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన సుమారు 25 లక్షల మంది

నగర రహదారులపై తగ్గిన రద్దీ

4503  ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ  

ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణమధ్య రైల్వే

సొంత వాహనాల్లోనూ పెద్దసంఖ్యలో ప్రయాణం

నగరానికి తరలివచ్చిన ఇతరప్రాంతాల వాళ్లు

అంతటా సంక్రాంతి సందడి

సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పల్లెబాట పట్టింది. అంబరాల సంక్రాంతి సంబరాల కోసం నగరం సొంత ఊరుకు తరలివెళ్లింది. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు  ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో  నగర ప్రజలు భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరారు. పండుగ ప్రయాణాల దృష్ట్యా  గత  వారం రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు  కిటకిటలాడాయి. కార్లు, బైక్‌లు  వంటి సొంత  వాహనాలపైన కూడా జనం పెద్ద ఎత్తున వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా వివిధ మార్గాల్లో సుమారు 25 లక్షల మంది ప్రజలు  తమ సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపైన వాహనాల రద్దీ తగ్గింది. రోడ్లు  ఖాళీగా కనిపించాయి. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో చాలా  మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్‌ రైళ్లల్లో అతికష్టంగా   బయలుదేరారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కానీ దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సుల్లో 10 శాతం నుంచి 20 శాతం వరకు చార్జీలు పెంచారు. ప్రైవేట్‌ బస్సులు మరో అడుగు ముందేసి డబుల్‌  చార్జీలు వసూలు చేశాయి.

పైగా ఒక ట్రావెల్స్‌కు, మరో ట్రావెల్స్‌కు మధ్య పొంతన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో  చాలా మందికి పండుగ ప్రయాణం  కష్టతరంగా మారింది. పిల్లలు, పెద్దలు, మహిళలు మరింత ఇబ్బందికి గురయ్యారు. సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక కోసం  నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే  చెల్లించుకోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి,  కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్‌ వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రోజువారి బయలుదేరే 85 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే అదనపు   రైళ్లను ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో పలు  ప్రధాన రైళ్లకు బోగీలను పెంచారు. అయినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు భర్తీ చేయలేకపోయాయి. మరోవైపు  హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా  రాకపోకలు సాగించే 3500 బస్సులకు అదనంగా 4503 బస్సులను  సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు కాకుండా సుమారు వెయ్యి ప్రైవేట్‌ బస్సులు  బయలుదేరాయి. మరో లక్షకు పైగా కార్లలో సైతం ప్రజలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. 

నగరానికీ తరలి వచ్చారు....
హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, వివిధ ప్రాంతాల్లోనూ స్థిరపడ్డ నగరవాసులు సైతంహైదరాబాద్‌కు తరలివచ్చారు. నగరంలోని పలుచోట్ల సంక్రాంతి సందడి నెలకొంది. పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన స్వీట్స్, కైట్స్‌ ఫెస్టివల్‌కు లక్షల సంఖ్యలో నగరవాసులు తరలి రావడం విశేషం. జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు, పతంగులతో ఈ వేడుకలు  ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఉప్పల్, హైటెక్‌సిటీ శిల్పారామాల్లోనూ సంక్రాంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఇదీ లెక్క ....
వారం రోజుల నుంచే  పండుగ  ప్రయాణాలు  మొదలైనప్పటికీ ఎక్కువ మంది 10,11,12,13  తేదీలలో  బయలుదేరి వెళ్లారు. పిల్లలకు లభించిన సెలవులను బట్టి ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. పైగా ఈ  నాలుగు రోజుల్లోనే  ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది.  
ప్రతి రోజు రైళ్లలో    రోజుకు  2 లక్షల చొప్పున 4 రోజుల్లో  8  లక్షల మంది బయలుదేరారు.
3500 రోజువారీ బస్సులతో పాటు, ఆర్టీసీ  మరో 4503 బస్సులు ప్రత్యేకంగా నడిపింది. నాలుగు  రోజులలో  సుమారు 10 లక్షల మందికి పైగా   ప్రయాణికులు  బయలుదేరారు.
వెయ్యి ప్రైవేట్‌  బస్సుల్లో  రోజుకు  40 వేల మంది చొప్పున  ఈ నాలుగు  రోజుల్లో  1.6 లక్షల మంది  వెళ్లారు.
ఇవి కాకుండా  సుమారు  80 వేల నుంచి  లక్షకు పైగా   కార్లు నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరి ఉంటాయని అంచనా.వీటిలో  ఈ నాలుగు  రోజుల్లో మరో 5 లక్షల మంది సొంత ఊళ్లకు  బయలుదేరారు.  అలాగే  తెలంగాణలోని  వివిధ ప్రాంతాలకు చాలామంది సొంత బైక్‌లపైన బయలుదేరి వెళ్లారు. అలా  50 వేల మందికి పైగా వెళ్లినట్లు అంచనా.  
మొత్తంగా సంక్రాంతి సందర్భంగా  సుమారు 25  లక్షల మంది ప్రయాణికులు  హైదరాబాద్‌ నుంచి తమ సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా.

మరిన్ని వార్తలు