శంకర్‌రెడ్డి దొరికాడు..

10 Jul, 2019 10:20 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రామోజీ రమేష్‌

విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటనలో శంకర్‌రెడ్డి అరెస్ట్‌ 

పోస్కో, అట్రాసిటీ కేసులు నమోదు 

వివరాలను వెల్లడించిన ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజీ రమేష్‌ 

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెజవాడ శంకర్‌రెడ్డి పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటంతో పాటు లైంగి కంగా వేధింపులకు పాల్పడగా ఫిబ్రవరి 2న అతనిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ ఘటనతో పరారీలో ఉన్న హెచ్‌ఎంను  మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూసుమంచి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మంరూరల్‌ ఏసీపీ రామోజీ రమేష్‌ వివరాలను వెల్లడించారు. 

హెచ్‌ఎం శంకర్‌రెడ్డి పాఠశాలలోని పలువురు విద్యార్థినులపై చేతులు వేయటం, వారిని తనపై కూర్చోబెట్టుకోవటం, లైంగికంగా   వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 2న బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హెచ్‌ఎం పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతన్ని డీఈఓ సస్పెండ్‌ చేశారు. పరారీలో ఉన్న హెచ్‌ఎం గుజరాత్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో తలదాచుకోగా పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇటీవల రైలులో ఖమ్మం వస్తున్న విషయాన్ని  తెలుసుకుని సిబ్బంది అప్రమత్తం కాగా గమనించి పరారయ్యాడు. మంగళవారం ఉదయం కూసుమంచిలో తనకు తెలిసిన వారిని కలిసేందుకు రాగా సమాచారం తెలుసుకుని ఎస్‌ఐ అశోక్‌ అతన్ని అరెస్ట్‌ చేశారు. విద్యార్థినులను వేధించిన ఫిర్యాదుపై తాము అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శంకర్‌రెడ్డిపై పోస్కో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు