బాలికలకు భరోసా హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కి ట్లు 

24 Aug, 2018 11:47 IST|Sakshi
విద్యార్థినులకు అందించనున్న హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లో ఉండే 13 రకాల వస్తువులు 

13 రకాల వస్తువులతో ఆరోగ్య రక్ష కిట్లు

నేడు ఉమ్మడి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు

భద్రాద్రిలో కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రారంభం

కొత్తగూడెం/జూలూరుపాడు/కొణిజర్ల/భద్రాచలం :  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య రక్ష (హెల్త్‌ అండ్‌ హైజిన్‌) కిట్లు అందజేయాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు చదివే బాలికలకు వీటిని పంపిణీ చేయనుంది. గతంలోనే మోడల్‌ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలలో బాలికలకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల బాలికలకు కూడా అందజేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు 13 రకాల వస్తువులతో కూడిన కిట్‌లు బాలికలకు అందజేయనున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ కిట్‌లు అందజేయనున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కిట్లు అందజేస్తుంది. 

బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా.. 

ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంతోపాటు, పలు కారణాలతో పెరుగుతున్న డ్రాపవుట్స్‌ల నివారణే లక్ష్యంగా గత ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆశించిన మేర సత్ఫలితాలనివ్వడంతోపాటు బాలికల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవడంతో ఈ ఏడాది రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ మోడల్‌ స్కూల్స్, గురుకుల, కేజీబీవీలు, పంచాయతీరాజ్‌ పాఠశాలలన్నింటిలోనూ ఈ కిట్‌ల పంపిణీకి నిర్ణయించింది.  

13 రకాల వస్తువులతో..  

బాలికల అవసరాల మేరకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లో 13 రకాల వస్తువులను అందజేయనున్నారు. వీటిని ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి చొప్పున జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నాలుగు సార్లు విద్యార్థినులకు అందచేయనున్నారు. వేసవి సెలవుల్లో సైతం అందేవిధంగా ముందస్తు క్యాలెండర్‌ను రూపొందించారు.  

భద్రాద్రిలో కలెక్టర్‌ చేతుల మీదుగా..  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జాయింట్‌ కలెక్టర్‌ రాంకిషన్‌లు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, కళాశాలలు, పంచాయతీరాజ్‌ పాఠశాలల్లోని విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు కిట్లను డీఈఓ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసీ కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు.  

జూలూరుపాడుకేజీబీవీని సందర్శించిన జేడీ 

రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం(హైదారాబాద్‌) జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ), ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ జి.రమేష్‌ గురువారం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలిక ఆరోగ్య రక్ష కిట్స్‌ పంపిణీ కార్యక్రమం, హరిత పాఠశాల, హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు, విద్యాలయంలోని సౌకర్యాలు, బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఎంఈఓ జి.వెంకట్, కేజీబీవీ ఇన్‌చార్జి ఎస్‌ఓ రజితలను అడిగి తెలుసుకున్నారు.

తరగతి గదులను, వంట గది, స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. బాలికలతో ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్‌ మొత్తం 734 పాఠశాలల్లోని 35,296 మంది బాలికలకు బాలికా ఆరోగ్య రక్ష(కేసీఆర్‌) కిట్లు అందజేస్తామని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో 434 పాఠశాలలకు చెందిన 19,859 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 పాఠశాలలకు చెందిన 15,437 మంది బాలికలకు కేసీఆర్‌ కిట్స్‌ ఇస్తామని తెలిపారు. కేజీబీవీల్లో విద్య అభ్యసించే 6 నుంచి 10వ తరగతి బాలికలకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్‌లో చదివే 7 నుంచి 10వ తరగతి బాలికలకు కేసీఆర్‌ కిట్స్‌ అందజేస్తామని తెలిపారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా హరిత పాఠశాల, హరిత కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎంఈఓ గుగులోతు వెంకట్, కేజీబీవీ ఇన్‌చార్జి ఎస్‌ఓ రజిత, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.  

గతంలో హాస్టళ్లకు వస్తువులు, స్కూళ్లకు నగదు..

ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమాలు, గురుకులాల్లో చదివే విద్యార్థినులకు ఆయా సంస్థల ఆధ్వర్యంలో న్యాప్‌కిన్‌లు, కాస్మొటిక్స్‌ను అందజేస్తున్నారు. సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులకు మూడు నెలలకోసారి కాస్మొటిక్స్‌ వస్తువుల కోసం వచ్చే డబ్బును ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో టెండర్లు నిర్వహించి సరఫరా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఇవి అందేవి కావు.

8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సర్వ శిక్ష అభియాన్‌ నిధుల నుంచి కాస్మొటిక్స్‌ కోసం డబ్బులు మంజూరు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అవి సక్రమంగా పంపిణీ కాకపోవటం, బాలికలు ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లి ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఫలితం కనిపించడం లేదు. దీనిని అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచే నేరుగా హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లను సరఫరా చేయాలని నిర్ణయించారు.  

మండలాలకు చేరిన కిట్‌లు.. 

హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లను సరఫరా చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒప్పందం చేసుకున్న సంస్థ వాటిని మండల కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేసింది. వీటిని ఆయా మండల విద్యాశాఖాధికారులు విద్యార్థినుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు చేరవేయాలి. ఇవి ప్రతీ విద్యార్థినికి అందేలా పాఠశాలల హెచ్‌ఎంలు బాధ్యత వహించాలి. సరఫరా అయిన కిట్‌లు, పంపిణీ లెక్క కచ్చితంగా ఉండేలా రిజష్టర్‌లో నమోదు చేయాలి. ఈనెల 24న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 30లోపు ప్రతీ విద్యార్థినికీ అందేలా చర్యలు తీసుకోవాలి.

మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు సకాలంలో హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లు సరఫరా చేసేందుకు  వాహన సదుపాయం కోసం కూడా నిధులు కేటాయించారు. 8 కిలోమీటర్ల లోపు ఉంటే రూ.300, ఆపైన దూరం ఉంటే రూ. 600 వాహనాలకు చెల్లించవచ్చు. వీటిని పాఠశాల గ్రాంట్‌ నుంచి వినియోగించుకునేలా ఉన్నతాధికారులు ఆదేశించారు.

భద్రాద్రిలో 15,437 కిట్‌లు సిద్ధం 

బాలికల వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణతో పాటు బాలికలలో డ్రాపవుట్స్‌ను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాలికా రక్షలో భాగంగా జిల్లాల పంపిణీ చేసేందుకు 15,437 కిట్‌లను సిద్ధం చేశాం. ఏడాదిలో నాలుగు సార్లు అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాం. బాలికావిద్యను అభివృద్ధి చేసేందుకు ఈ హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

–డి వాసంతి, డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం

కిట్‌లో ఉండే వస్తువులు 

  •      బాత్‌ సోప్స్‌ (పతంజలి)–3 
  •      డిటెర్జంట్‌ సోప్స్‌(పతంజలి)–3 
  •      కొబ్బరి నూనె(డాబర్‌)–1 
  •      షాంంపూ బాటిల్‌(డాబర్‌)–1 
  •      ఫేస్‌ పౌడర్‌( ఐటెక్స్‌)–1  
  •      టూత్‌ పేస్ట్‌(డాబర్‌)–1 
  •      టూత్‌ బ్రష్‌(పతంజలి)–1 
  •      టంగ్‌ క్లీనర్‌–1  
  •      దువ్వెన–1 
  •      బొట్టు బిళ్లలు (ఐటెక్స్‌) 77నుంచి 90 వరకు ఉండే ప్యాకెట్‌–1 
  •      నెయిలాన్‌ రిబ్బన్స్‌–2 
  •      హెయిర్‌ బాండ్స్‌–2 
  •      శానిటరీ న్యాప్‌కిన్స్‌ (జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌)–3  
  •      హ్యాండ్‌ వాష్‌ కోసం స్కూల్లోని పిల్లలందరికీ కలిపి 5 లీటర్ల బాటిల్‌ –1
మరిన్ని వార్తలు