టీచర్ల భాగస్వామ్యం అవసరం

14 Mar, 2018 01:58 IST|Sakshi

ఉద్యోగులందరికీ హెల్త్‌ కార్డులు : హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో (టీయూటీఎఫ్‌) ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు – విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పాఠశాల విద్య – సంస్కరణ’లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు వేసింది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) అని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్‌ వీరోచితంగా పాల్గొందని అందుకే ఆ సంఘం మీద ప్రభుత్వానికి ఎనలేని గౌరవమన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు అందజేశామన్నారు. ఉపాధ్యాయ నియామకాలు – బదిలీలు జూన్‌ లోపల పూర్తి చేసేలా విద్యామంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానంపై సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పార్లమెంట్‌లో చట్టం కావాల్సి ఉందన్నారు. 60 ఏళ్ల పరిష్కారం కానీ తాగు, సాగునీరు, విద్యుత్‌ వంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 18 శాతం వృద్ధి రేటును ఒక తెలంగాణ సాధించిందని చెప్పారు.  

ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి: ఈటల 
రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఎన్ని పెట్టినా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా అవి మూతపడకుండా ఉండేందుకు టీయూటీఎఫ్‌ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వి. శ్రీనివాస్‌ గౌడ్, ఎ.రవీందర్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి, టీయూటీఎఫ్‌ అధ్యక్ష – ప్రధాన కార్యదర్శులు సి. స్వామిరెడ్డి, డి. మల్లారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు