పాపం.. పోలీస్‌

25 May, 2020 08:20 IST|Sakshi

పరీక్షలు లేకుండానే వెనక్కి వెళ్లిన పోలీసులు

నగరంలో ప్రహసనంగా మారిన పోలీస్‌ సేఫ్టీ

సాక్షి,సిటీబ్యూరో: కరోనా నియంత్రణలో విశ్రాంతి లేని డ్యూటీలు, సమయానికి ఆహారం నిద్ర కరవుతో ఇబ్బంది పడుతున్న కింది స్థాయి పోలీస్‌ సిబ్బందిని రక్షించుకునేందుకు ప్రారంభించిన పోలీస్‌ ఆరోగ్య పరీక్షల అంశం ప్రహసనంగా మారింది. ఇటీవల కుల్సుంపురాలో ఒకరి మరణంతో హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమీషనరేట్లలో పనిచేస్తున్న పలువురు పోలీస్‌లు కరోనా బారిన పడటంతో తమ సిబ్బంది అందరికీ ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.  శనివారం నగరంలోని నార్త్‌జోన్‌లో ప్రతి స్టేషన్‌ నుంచి ఇద్దరి చొప్పున పిలిచి పలు రకాల పరీక్షలు చేశారు.

అందులో భాగంగానే ఆదివారం సైతం బోయిన్‌పల్లి పీఎస్‌లో పనిచేస్తున్న వారితో పాటు సౌత్‌జోన్‌లో ప్రతి పీఎస్‌ నుంచి ఇద్దరి చొప్పున ఆదివారం ఉదయం గోషామహల్‌కు పిలిచారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూసినా.. వైద్య సిబ్బంది ఎవరూ రాలేదు. తీరా సాయంత్రం ఐదున్నర తరువాత  మంగళవారం రమ్మని చెప్పి షట్టర్‌ క్లోజ్‌ చేశారు. ఆదివారం గోషామహల్‌కు వచ్చిన పోలీస్‌ సిబ్బందిలో ఒకరి ఆరోగ్యం బాగా లేదని తెలిసింది. మంగళవారం వరకూ ఎలాంటి పరీక్షలు, చికిత్స అందకపోతే ఎలా అంటూ వచ్చిన పోలీస్‌లంతా తిరిగి వెళ్లటం కనిపించింది. సమాజశ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న తమ ఆరోగ్య పరీక్షల అంశం ప్రహసనంగా మార్చటంపై కింది స్థాయి సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. 

మరిన్ని వార్తలు