సమస్యలు పరిష్కరించాలి

3 May, 2018 11:00 IST|Sakshi
ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు

వైద్యశాఖ కాంట్రాక్ట్‌  ఉద్యోగుల డిమాండ్‌

రెండో రోజూ కొనసాగిన ధర్నా

వంటావార్పుతో నిరసన

ఆర్మూర్‌ : ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి గురవుతున్న వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పెన్‌డౌన్, టౌల్‌ డౌన్‌ నిరసన కార్యక్రమం బుధవారం కొనసాగింది. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ప్రాంగణం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడంతో పాటు అక్కడే వంటావార్పు, భోజనాల కార్యక్రమాలు నిర్వహించారు.

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లను సాధించుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నాకు రెగ్యులర్‌ ఉద్యోగులు సంఘీబావం తెలిపారు.

మరిన్ని వార్తలు