రూపాయికే ఆరోగ్య పథకం

30 Jun, 2019 03:21 IST|Sakshi

కరీంనగర్‌ బల్దియాలో మరో నాలుగు కొత్త పథకాలు 

నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌ వెల్లడి 

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సం స్థలో మరో నాలుగు కొత్త పథకాలు రూపుదిద్దుకున్నాయి. రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమం అమ లు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కరీంనగర్‌ బల్దియా.. అదే స్ఫూర్తితో మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. మూడు రోజుల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కొత్త పథకాల గురించి వివరించారు. పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్‌ చేసే విధంగా పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్‌ ఆవరణలోనే పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ సహకారంతో ఒక డాక్టర్, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ను నియమిస్తామన్నారు.

వైద్య పరీక్షల కోసం వేల రూపాయల ఖర్చును భరించలేని పేదల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికీ చెప్పులు లేకుండా నడిచేవారు ఉన్నారని వారందరికీ చెప్పులు అందించే విధంగా బూట్‌హౌస్‌ పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇళ్లలో మూలన పడి ఉన్న పాత చెప్పులు, బూట్ల జతలు తీసుకొచ్చి రిపేర్లు చేసి అందిస్తామన్నారు. ఇందుకోసం కళాభారతిలో షెడ్డును నిర్మిస్తామని తెలిపారు. నగరంలోని కమ్యూనిటీ హాళ్లలో నాలుగు రీడింగ్‌రూంలు ఏర్పా టు చేసి ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు. మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో సేవా దృక్ఫథంలో నడుస్తున్న నైట్‌ షెల్టర్‌లోనే అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు