‘ఆరోగ్యసేవలు’  కొనసాగుతాయి: కేటీఆర్‌

25 Mar, 2018 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆర్యోగ సేవల పథకం(ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌) కొనసాగుతుందని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్‌తో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ జనరల్‌ సెక్రటరీ క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు రవికుమార్‌ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌ పథకంపై ఇటీవల వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి అందరికీ ఆమోద్యయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నాన్‌ అక్రిడిటెడ్‌ జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సమాచార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. వెల్‌నెస్‌ సెంటర్లలో మందుల కొరత, కొన్ని ఆసుపత్రులు హెల్త్‌కార్డులను నిరాకరిస్తున్నాయని కేటీఆర్‌కు చెప్పారు. ఓ చానల్‌లో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా ఉన్న కరీం అనే జర్నలిస్టు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె వైద్య ఖర్చులకు రూ.12 లక్షల ఎల్వోసీ ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.  

>
మరిన్ని వార్తలు