సూపర్‌ పోలీస్‌.. రెండు గంటల్లో గుండె తరలింపు

11 Feb, 2018 09:41 IST|Sakshi
హైదారాబాద్‌కు గుండెను తరలింపు యత్నం

ప్రాణం నిలిపిన కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, కరీంనగర్‌ : ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బె్రయిన్‌ డెడ్‌ అయిన ఒక యువకుడి గుండెను  రోడ్డు మార్గంలో కరీంనగర్‌ నుంచి కేవలం రెండు గంటల్లో హైదరాబాద్‌ చేర్చి మరో వ్యక్తి ప్రాణాలు కాపాడారు కరీంనగర్‌ కమీషనరేట్‌ పోలీసులు...

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 8న జగిత్తాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మేకల నవీన్‌ కుమార్‌  ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలిచారు.  నవీన్‌ను ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేక శుక్రవారం రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయి మరణించాడు. అదే సమయంలో జీవన్‌ధార ట్రస్ట్‌ నిర్వాహకులు హైదరాబాద్‌లోని  జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మరో వ్యక్తికి గుండె మార్పిడి అవసరం ఉందని గుర్తించారు. అయితే రెండు గంటల్లో గుండెను కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ తరలించాలి. దీంతో కరీంనగర్‌ పోలీసులు హైదరాబాద్‌, సిద్దిపేట పోలీసుల సహకారంతో గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 6.50 గంటలకు ప్రత్యేక వాహనంలో బయలుదేరి 8.50 గంటలకు గుండెను అపోలో ఆస్పత్రికి చేర్చారు.

అనంతరం నవీన్‌ గుండెను 47ఏళ్ల వ్యక్తికి అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతమైంది. గుండె తరలింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ను అపోలో సంస్థల చైర్మెన్‌ ప్రతాప్‌ సి రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు