పెరుగుతున్న‘భానుడి’.. భగభగలు 

16 Mar, 2019 11:08 IST|Sakshi

అంతకంతకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

మధ్యాహ్నం బయటికి వెళ్లాలంటే జంకుతున్న జనం

ఆరోగ్యం జాగ్రత్త అంటున్న వైద్య నిపుణులు

సాక్షి, మెదక్‌జోన్‌: మెతుకుసీమపై సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. పది రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. ఉపాధికూలీలు ఎండలోనే పనులు చేస్తూ ఆందోళనకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మార్చి రెండో వారంలోనే 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వచ్చే ఏప్రిల్‌లో 45డిగ్రీల కు చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా ఈయేడు మరో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొం టున్నారు. ముఖ్యంగా షుగరు, బీపీ లాంటి వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నపిల్లలు, వయోవృద్ధులు, మహిళలు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు