నేడు, రేపు వడగాడ్పులు

29 Apr, 2019 02:07 IST|Sakshi

నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

తుపాన్‌ ప్రభావంతో అక్కడక్కడా మోస్తరు వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44, నల్లగొండ, మెదక్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, ఖమ్మంలో 42 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఫణి తుఫాను ఉత్తర దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది.

ఇది 12 గంటలలో తీవ్ర తుఫానుగాను, తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగాను మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అనంతరం మే 1వ తేదీ సాయంత్రం వరకు వాయవ్య దిశగా ప్రయాణించి, తరువాత దిశ మార్చుకుని క్రమంగా ఉత్తర ఈశాన్య దిశ వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  

వడదెబ్బతో నలుగురు మృతి 
ధర్మపురి/వెల్గటూర్‌/కథలాపూర్‌/కోల్‌సిటీ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే నలుగురు మృత్యువాతపడ్డారు. వెల్గటూర్‌ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన ముస్కు ఆదిరెడ్డి (80) వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామానికి చెందిన ముత్తునూరి శాంతమ్మ (58) వారం రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందింది. కథలాపూర్‌ మండలం పెగ్గెర్లలో వార్డు సభ్యుడు మామిడిపెల్లి గంగారెడ్డి(50) వడదెబ్బకుగురై సాయంత్రం మృతిచెందారు. అలాగే గోదావరిఖనిలో అనిల్‌కుమార్‌ షిండే (55) ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

మరిన్ని వార్తలు