నల్లగొండ సరిహద్దుల్లో ఉద్రిక్తత

27 Mar, 2020 03:26 IST|Sakshi
వాడపల్లి వద్ద వాహనదారులతో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

పెద్దసంఖ్యలో స్వస్థలాలకు బయలుదేరిన ఏపీ వాసులు

వాడపల్లి వంతెన వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డి

క్వారంటైన్‌ షరతులతో అనుమతించిన ఏపీ పోలీసులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ: కార్లు, ద్విచక్రవాహనాల పై వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురువారం నల్లగొండ జిల్లాలో ఏపీతో సరిహద్దులు ఉన్న రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి వేల సం ఖ్యలో ప్రజలు రావడంతో దామచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు, నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టుల వద్ద ఏపీ పోలీసులు వారిని కొద్దిసేపు అడ్డుకుని అనంతరం షరతులతో రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించారు.

ముఖ్యమంత్రి దృష్టికి సమస్య 
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామునుంచే ద్విచక్రవాహనాలు, కార్లల్లో ఏపీకి వెళ్లేందుకు జనం వచ్చారు. చెక్‌పోస్టు వద్ద నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) చూసిన అనంతరం తెలంగాణ పోలీసులు వారు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణానది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వీరిని కొద్దిసేపు అడ్డుకున్నారు. సమస్య తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలసి వాడపల్లి చెక్‌ పోస్టును సందర్శించారు. పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రజలు వచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని, ఇకపై సరిహద్దును మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోవద్దని మంత్రి సూచించారు.

క్వారంటైన్‌కు వెళతామంటేనే అనుమతి 
ఏపీకి సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్‌పై వంతెన దాటగానే గుంటూరు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు, మెస్సులు మూతపడడంతో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) తీసుకుని బుధవారం రాత్రే ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున బయలుదేరి తెల్లారే సరికల్లా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. మరికొంతమంది అద్దెకార్లు, టాటా సుమోల్లో ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే నాగార్జునసాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వారి వాహనాలను మొదట నిలిపివేశారు. దీనిపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుంటూరు జిల్లా ఎస్పీ విజయారావు సరిహద్దుకు చేరుకుని 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళతామంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ షరతు నచ్చని చాలామంది తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లొచ్చని వాడపల్లికి వచ్చారు.

మరిన్ని వార్తలు