జోరు పెరిగిన ‘టీఎస్’

25 Jun, 2014 00:32 IST|Sakshi
జోరు పెరిగిన ‘టీఎస్’

- ఆర్టీఏ కార్యాలయంలో  భారీగా వాహనాల రిజిస్ట్రేషన్లు
- మేడ్చల్ రీజియన్‌కు టీఎస్ 07ఈబీ0001 సిరీస్ కేటాయింపు: ఆర్టీఓ శంకర్

మేడ్చల్ రూరల్: మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ (టీఎస్) సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సమ్మతించి జులై 2న అపాయింటెడ్ డే గా ప్రకటించడంతో వాహన యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకొంటే తెలంగాణ సిరీస్ వస్తుందనే ఈ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు.

ఇటీవల టీఎస్ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకు టీఎస్ 07, 08 సిరీస్‌ను కేటాయించగా మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయ పరిధికి టీఎస్ 07 కేటాయించినట్లు స్థానిక ఆర్టీఓ శంకర్ తెలిపారు. ఈ సిరీస్‌తోనే వాహనాలకు ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. వాహనదారులు ఒరిజనల్ పత్రాలతో  కార్యాలయంలో సంప్రందించాలని శంకర్ సూచించారు.
 
పాత వాహనదారులు ఆందోళన చెందవద్దు: ఆర్టీఓ శంకర్
పాత వాహనాల యజమానులు తమ పాత నంబర్ సిరీస్‌ను తొలంగించి టీఎస్ సిరీస్‌గా మార్చుకోవడంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీఓ శంకర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నామని, పాత వాహనాల సిరీస్ మార్పు చేయడానికి ఎటువంటి ఉత్తర్వులు అందలేదని వివరించారు.

ద్విచక్ర వాహనాలకు మేడ్చల్ ఆర్టీఏ పరిధికి టీఎస్07 ఈబీ0001 రిజిస్ట్రేషన్ నంబరు నుంచి ప్రారంభమైందని, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు టీఎస్07యూబీ 0001 నుంచిప్రారంభించామని ఆయన తెలిపారు. పాత వాహనాల సిరీస్ మార్పు కోసం ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వాహనదారులు ఈ విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. కొందరు పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్‌గా నంబరుప్లేటుపై మార్పు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆర్‌సీని మార్పు చేసిన అనంతరమే నంబర్‌ప్లేట్‌పై సిరీస్‌ను మార్పు చేసుకోవాలన్నారు.

>
మరిన్ని వార్తలు