‘పది’ పరీక్షలు ప్రక్షాళన

4 May, 2014 23:53 IST|Sakshi

మెదక్, న్యూస్‌లైన్:  పదోతరగతి పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతమున్న 11 పేపర్ల స్థానంలో తొమ్మిది పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రణాళికను సిద్ధం చేసింది.  తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు ఒక్కోపేపర్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఒక్కో సబ్జెక్టుకు వందమార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అందులో కూడా 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విధానానికి విద్యార్థులు అలవాటయ్యేందుకు తొమ్మిదో తరగతిలోనూ ఇదే పద్ధతి ప్రవేశపెట్టాలని (ఎన్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి భావిస్తోంది. ఉత్తీర్ణత మార్కులు మాత్రం 35 శాతంగానే నిర్ధారించనున్నట్లు స మాచారం. విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్‌టీ లు ఆమోదం తెలుపగా, వచ్చేవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లనున్నట్లు సమాచారం.

 ముందస్తు ప్రణాళికతో ముందుకు
 బట్టీ విధానానికి స్వస్తి పలికి, పరీక్షల భయాన్ని తొలగించి, విద్యార్థుల్లోని సామర్థ్యాలను గుర్తించి, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం 2012-13 విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం గత ఏడు 9వ తరగతికి, ఈసారి 10వ తరగతి విద్యార్థులకు సీసీఈ ప్రకారం సిలబస్‌ను రూపొందించి నూతన పాఠ్యపుస్తకాలను అందజేశారు. ముఖ్యంగా పదోతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు చివరి పరీక్ష రోజునే పాఠ్య పుస్తకాలను అందజేశారు.

 పేపర్ల స్వరూపం
 మూడు లాంగ్వేజ్‌లు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్)లకు ఒక్కో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. గణితం మొదటి పేపర్‌లో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, రెండవ పేపర్‌లో త్రికోణమితి, క్షేత్రగణితం, సంఖ్యాశాస్త్రాలుంటాయి. సైన్స్ జీవశాస్త్రానికి ఒకపేపర్, బౌతిక, రసాయన శాస్త్రాలు మరో పేపర్‌లో ఉంటాయి. సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌లో భూగోళం, అర్థశాస్త్రం, రెండవపేపర్‌లో పౌరశాస్త్రం, చరిత్ర పేపర్‌లు ఉంటాయి. 80 మార్కుల రాత పరీక్షలో కనీసం 28 మార్కులు, ఇంటర్నల్‌లో 7 మార్కులు వస్తే విద్యార్థి ఉత్తీర్ణత సాధిస్తాడు. అంటే భాషేతర సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌కు 50 మార్కులు ఉండగా అందులో 40 మార్కులు రాత పరీక్షకు, 10 మార్కులు ఇంటర్నల్‌కు ఉంటాయి.

 మారనున్న గ్రేడింగ్
 కొత్త విధానంతో గ్రేడింగ్ విధానం కూడా మారనుంది. లాంగ్వేజెస్ పరీక్షల్లో 91 నుంచి 100 మార్కులు వస్తే ఏ-1 గ్రేడ్ 10 పాయింట్లు, 81 నుంచి 90 మార్కులు వస్తే ఏ-2 గ్రేడ్ 9 పాయింట్లు, 71 నుంచి 80 మార్కులు వస్తే ఇ-1 గ్రేడ్ 8 పాయింట్లు, 61 నుంచి 70 మార్కులు వస్తే ఇ-2 గ్రేడ్ 7పాయింట్లు, 51 నుంచి 60 మార్కులు వస్తే సీ-1 గ్రేడ్ 6 పాయింట్లు, 41 నుంచి 50 మార్కులు వస్తే సీ-2 గ్రేడ్ 5 పాయింట్లు, 35 నుంచి 40 మార్కులు వస్తే డీ-1 గ్రేడ్ 4 పాయింట్లు, 1 నుంచి 34 మార్కులు వస్తే డీ-2 గ్రేడ్ 3 పాయింట్లు వస్తాయి, అదేవిధంగా భాషేతర సబ్జెక్టుల్లో 46 నుంచి 50 వస్తే ఏ-1 గ్రేడ్ 10 పాయింట్లు, 41 నుంచి 45 వస్తే ఏ-2 గ్రేడ్ 9 పాయింట్లు, 36 నుంచి 40 వస్తే బి-1 గ్రేడ్ 8 పాయింట్లు, 31 నుంచి 35 వస్తే బీ-2 గ్రేడ్ 7 పాయింట్లు, 26 నుంచి 30 వస్తే సీ-1 గ్రేడ్ 6 పాయింట్లు, 21 నుంచి 25 వస్తే సీ-2 గ్రేడ్ 5 పాయింట్లు, 18 నుంచి 20 వస్తే డీ-1 గ్రేడ్ 4 పాయింట్లు, 1 నుంచి 17 వస్తే డీ-2 గ్రేడ్ 3 పాయింట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్‌టీ ఈ విధానానికి తమ ఆమోదం తెలిపిందని జూన్ 2న ఏర్పడనున్న కొత్త రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు