ఆఖరి పోరాటం

7 Nov, 2018 09:20 IST|Sakshi

టికెట్ల కోసం కాంగ్రెస్‌ నేతల చివరి ప్రయత్నాలు

ఢిల్లీ, హైదరాబాద్‌ స్థాయిల్లో పైరవీలు

మంచిర్యాల సీటుపైనే అన్ని పార్టీల గురి

తాజాగా తెరపైకి కోదండరామ్‌

 సొంత జిల్లా నుంచే పోటీ  చేయాలని సార్‌కు విజ్ఞప్తులు

 హైదరాబాద్‌లో సీపీఐ  శంకర్‌ మకాం

 కాంగ్రెస్‌లో టికెట్లతో పాటే    పొంచి ఉన్న రెబల్స్‌

పండుగ తెల్లారి అభ్యర్థుల   ప్రకటన

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌ : కాంగ్రెస్‌ టికెట్టు ఆశావహుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. టికెట్టు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిన నేతలు ఆఖరి పోరాటం సాగిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోని తమ గాడ్‌ఫాదర్ల ద్వారా తుది ప్రయత్నాల్లో మునిగిపోయారు. కూటమి తరఫున దీపావళి మరుసటి రోజే 119 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఆశావహుల్లో ఆందోళన తీవ్రమైంది. ఏ సీటు మిత్రపక్షాలకు వెళుతుందో, ఏ సీటులో ఎవరికి టికెట్టు లభిస్తుందో ఢిల్లీ స్థాయిలో చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో టీజేఎస్, సీపీఐ పార్టీలు సైతం తమ వ్యూహాలకు పదను పెట్టాయి. ఉమ్మడి జిల్లా నుంచి తమ ప్రాతినిధ్యం తప్పనిసరి అని చెపుతూ ఆ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి.
 
చివరి ప్రయత్నాల్లో...
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎ.రేవంత్‌రెడ్డి తదితర నేతలు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో వారి అండతో సీట్లు ఆశిస్తున్న నాయకులు కూడా దేశ రాజధాని బాట పట్టారు. ఉమ్మడి జిల్లా కు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలో తమ తుది ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. చెన్నూరు సీటును టీజేఎస్‌ కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ టికెట్టు ఆశిస్తున్న మాజీ అధికారి బోర్లకుంట వెంకటేష్‌ నేత ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు సమాచా రం. పార్టీ ముఖ్య నేత కొప్పుల రాజు ద్వారా ఆ సీటు టీజేఎస్‌కు వెళ్లకుండా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాల నుంచి సీటు ఆశిస్తున్న ఓ నాయకుడు సైతం ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పైరవీ చేస్తున్నట్లు సమాచా రం. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆశావహులు ఎవరూ స్థానికంగా లేకుండా హైదరాబాద్, ఢిల్లీలోనే టికెట్ల పైరవీల్లో మునిగిపోయారని సమాచారం. 

మంచిర్యాలపైనే అన్ని పార్టీల గురి
మంచిర్యాల సీటు కోసం కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి టికెట్టు వేటలో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ప్రేంసాగర్‌రావు భట్టి విక్రమార్క వర్గంలో ఉండి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు హామీ కూడా పొందినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వర్గీయుడిగా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ ప్రకటించింది. తాము కోరిన ఐదు సీట్లు ఇవ్వకపోతే ప్లాన్‌–బిలో భాగంగా పోటీ చేస్తామని చెప్పిన తొమ్మిది సీట్లలో మంచిర్యాల కూడా ఉంది. మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ వారం రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి ఆ పార్టీ నాయకుల మనస్సు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బెల్లంపల్లి బదులు మంచిర్యాల కోరేలా ఒత్తిడి కూడా తెచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మంగళవారం కోదండరామ్‌ను కలిసిన మంచిర్యాల జిల్లా టీజేఎస్‌ నేతలు ఆయనను మంచిర్యాల నుంచే పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించారు. రామగుండం నుంచి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సొంత జిల్లా మంచిర్యాల నుంచే పోటీ చేయాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ రూపొందించిన టీజేఎస్, సీపీఐ పార్టీలు పోటీ చేసే సీట్ల జాబితాలో మంచిర్యాల లేకపోవడం గమనార్హం.

అభ్యర్థుల ప్రకటనతో పాటే పొంచి ఉన్న రెబల్స్‌
కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని కూటమి నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెపుతున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే రెబల్స్‌ జాబితా కూడా బయటకు వస్తుందని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మంచిర్యాల టికెట్టు ఆశిస్తున్న ప్రేంసాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలలో ఎవరికి సీటొచ్చినా, మరొకరు రెబల్‌గా బరిలోకి దిగడం ఖాయం. ఒకవేళ ఇక్కడ కోదండరామ్‌ బరిలో నిలిచినా... ప్రేంసాగర్‌రావు ఈసారి పోటీలో ఉండడం అనివార్యమే. ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీచేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే టికెట్టు లభించని నేతతో ‘వార్‌ రూం’లో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడి బుజ్జగించే కార్యక్రమం అనివార్యమని పార్టీ నేతలు చెపుతున్నారు. చెన్నూరులో సైతం టీజేఎస్‌కు సీటిస్తే  కాంగ్రెస్‌ రెబల్‌గా గాని, బీఎస్‌పీ నుంచి గాని ఓ నాయకుడు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ముథోల్, బోథ్, ఖానాపూర్, సిర్పూరులలో కూడా రెబల్స్‌ బెడద ఆ పార్టీని భయపెట్టనుంది. బెల్లంపల్లిలో సీపీఐకి సీటిచ్చినా, రెబల్‌గా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే నాయకులు లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు