ఎత్తులు పైఎత్తులు

3 Jul, 2014 02:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరులోని పురాలను తమ పరం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. పీఠాలను దక్కించుకునేందుకు పక్కా వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో పుర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు హంగ్ ఏర్పడిన ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. నిజామాబాద్, బోధన్‌లలో ఎంఐఎం మద్దతు కూడగట్టుకున్న టీఆర్‌ఎస్, ఆర్మూర్‌లో బీజేపీ కౌన్సిలర్ మద్దతు, ఎక్స్ ఆఫీషియోల ఓట్లతో గట్టెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

 నిజామాబాద్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్, బోధన్‌లలో ఎంఐఎం, ఇతర పార్టీల మద్దతుతో గట్టెక్కేందుకు ఆమె సంబంధిత నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మున్సిపల్, పరిషత్ పరోక్ష ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు.

ఇక కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత డి.శ్రీనివాస్ నిజామాబాద్ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల కోసం కసరత్తు చేస్తున్నారు. మామంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కేలా చూస్తున్నారు.

 అధిక స్థానాలపై అధికారపక్షం కన్ను
 నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్ బల్దియాలపై అధికార పార్టీ టీఆర్‌ఎస్ కన్నేసింది. పార్టీ ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతోనైనా ఈ మూడింటినీ దక్కించుకునే వ్యూహం సిద్ధం చేసుకుంది. నిజామాబాద్‌లో మొత్తం 50 డివిజన్లకు 10 స్థానాలను గెలిచిన టీఆర్‌ఎస్ ఇక్కడ ఎంఐఎం మద్దతుతో 26కు పెంచుకుంది. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ల మద్దతుతో ఈసంఖ్య 28కి చేరనుండగా.. మరో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ క్యాంపుతో హాజరవుతున్నట్లు సమాచారం.

బోధన్‌లో మొత్తం 35 వార్డులకు టీఆర్‌ఎస్ 9 వార్డులు గెలుచుకోగా ఆరుగురు ఎంఐఎం కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ, టీడీపీకి చెందిన ఒక్కరి మద్దతును కూడగట్టినట్లు సమాచారం. ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఆహ్మద్ ఎక్స్‌అఫీషియోగా ఓటెయ్యనున్నారు. ఆర్మూర్‌లో 23 వార్డులకు 10 టీఆర్‌ఎస్‌కు, 11 కాంగ్రెస్ దక్కాయి.

 బీజేపీకి చెందిన కౌన్సిలర్ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతుండటంతో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిల ఓట్లతో ఇక్కడ టీఆర్‌ఎస్ గట్టెక్కే అవకాశం ఉంది. కామారెడ్డిలో మొత్తం 33 వార్డుల్లో 17 కాంగ్రెస్‌కు దక్కాయి. ఎంఐఎంకు చెందిన ఒక్కరు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో పాటు ఎక్స్‌అఫీషియో షబ్బీర్‌అలీ ఓటు కలిపితే కాంగ్రెస్ మెజార్టీ 20కి చేరనుంది.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రతిష్టాత్మకం
 మున్సిపాలిటీ పీఠాలు దక్కించుకోవడం మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పురపోరులో టీడీపీ నామరూపాలు లేకుండా పోగా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం, బీజేపీలు కీలకంగా మారాయి. నిజామాబాద్, బోధన్‌లతో టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతు కూడగడుతుండగా... కామారెడ్డిలో ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు తెలిసింది.

 ఆర్మూర్‌లో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలిపేందుకు సిద్ధమైంది. పరోక్ష ఎన్నికలు ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. నిజామాబాద్ మేయర్ పీఠం వైశాలినిరెడ్డి(టీఆర్‌ఎస్)కి దక్కనుంది. ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్వాతిసింగ్‌బబ్లూ, ఎ.ఎల్లయ్య ఎన్నిక కానున్నారు. కామారెడ్డి చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన పిప్పిరి సుష్మ కానుంది.

మరిన్ని వార్తలు